కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లోద్దిగూడ సమీపంలోని రాఘవాపూర్ గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఓ ఇంట్లో కొన్నిరోజుల్లో కుమారుడి పెళ్లి జరగనుండగా.. ఈ ప్రమాదం విషాదం నింపింది. పెళ్లి సామగ్రి, బంగారం, నిత్యావసర సరకులన్ని అగ్నికి ఆహుతయ్యాయి.
మరో ఇంట్లో బంగారం, నగదు, విలువైన సామగ్రితో పాటు ద్విచక్రవాహనం, సైకిల్, రెండు ఎడ్లబండ్లు కాలి బూడిదయ్యాయి. రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమవ్వడం వల్ల ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న తహశీల్దార్ ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీశారు. దాదాపు రూ.5 లక్షల నగదు, ఆరు తులాల బంగారం నష్టపోయినట్లు తెలిపారు. తక్షణ సాయంకింద 25 కిలోల బియ్యం, నిత్యావసర సరకులను ఇరు కుటుంబాలకు అందజేశారు.
స్థానిక నాయకులు రూ.10వేల ఆర్థిక సాయం, నిత్యావసర సరకులు అందించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో మాట్లాడి పెళ్లికి సంబంధించి ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.