Road Accident: ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఇద్దరు పనిమీద బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా బోర్ వెల్ బండి రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని కబళించింది. చావులోనూ వారి స్నేహబంధం విడదీయలేకపోయింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ వద్ద సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారి పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ గ్రామానికి చెందిన సలీం(25), నిఖిల్(21) ఇద్దరు ప్రాణ స్నేహితులు. అయితే ఈరోజు ఉదయం సమయంలో ఇద్దరు కలిసి బైకుపై నిజాంపేట్ నుంచి పెద్దశంకరంపేట్ గ్రామానికి బయలుదేరారు. కొంత దూరం వెళ్లాక వెనక నుంచి అతివేగంగా వస్తున్న బోర్ వెల్ బండి ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సలీంను 108 వాహనంలో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. ప్రాణస్నేహితులైన వారిద్దరి మృతి ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సలీంకి ఇటీవలే పెళ్లి నిశ్చితార్థం జరిగింది.