మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రమాదవశాత్తు ఇద్దరు చెరువులో పడి మృతి చెందారు. బౌరంపేటకు చెందిన సంతోష్(24), వినోద్ ఆదివారం సాయంత్రం గేదెలను మేపేందుకు సమీప చెరువు వద్దకు తీసుకెళ్లారు. చెరువులోకి వెళ్లిన గేదెలను బయటకు తీసే క్రమంలో సంతోష్ ప్రమాదవశాత్తు అందులోనే మునిగి చనిపోయాడు. వినోద్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు.
మరో ఘటనలో దుండిగల్ పరిధికి చెందిన సురేష్ మద్యం మత్తులో.. మల్లంపేట కత్వ చెరువు వద్దకు వెళ్లాడు. మత్తులో ఉన్న అతను అందులో పడి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఇదీ చదవండి: రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల వర్షాలు