twist in secretariat employee death: ఔరా.. ప్రజలు ఎంతకు తెగిస్తున్నారు. ఒకప్పుడు బీమా కట్టుకోండి.. 'చనిపోతే మీ ప్రాణాలు తిరిగిరాకపోవచ్చు కానీ మీరు చనిపోయిన తర్వాత.. వచ్చిన డబ్బుతో మీ కుటుంబానికి ఒక దారి చూపిన వాళ్లు అవుతారు అనే వారు.' కానీ మనం చనిపోయిన తరువాత వచ్చిన డబ్బులతో మనకేం పని అనుకోనేవాళ్లే ఎక్కువే మంది. ప్రస్తుత రోజుల్లో మాత్రం అలా కాదు మన బీమా చేయించుకోనవసరం లేదు మన పేరు మీద వేరేవాళ్లు చేయిస్తారు.
డబ్బులు కూడా అవసరం లేదు వారే కట్టుకుంటున్నారు. మనం చేయాల్సింది ఒక్కటే వారి చేతిలో మనం చనిపోవడమే.. ఇదేంటి అనుకుంటున్నారా.. ఈ మధ్య కాలంలో జరిగిన వరుస ఘటనలే ఇందుకు తార్కాణం. మొన్న అనాథకు బీమా చేయించి హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించిన క్రైం స్టోరీ మరవక ముందే తాజాగా బీమా సొమ్ము కోసం ఒకరిని చంపేసి కారులో ఉంచి ప్రెట్రోల్ పోసి సజీవ దహనం చేసి తానే మృతి చెందినట్లు చిత్రీకరించాడు తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగి.
బీమా డబ్బులు కోసం ధర్మ ఆడిన నాటకం: మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటాపురంలో ఇటీవల కారు తగలబడి, వ్యక్తి సజీవ దహనమైన కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో చనిపోయాడనుకున్న ధర్మ అధర్మనాటకమాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 9న టేక్మాల్ మండలం వెంకటాపురం వద్ద కారు ప్రమాదానికి గురైంది. గుర్తించిన పోలీసులు అందులో ఓ వ్యక్తి సజీవదహనమైనట్లు గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి భీమ్లా తండాకు చెందిన ధర్మగా ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్ సెక్రటేరియేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ధర్మ కారులో సజీవదహనం కావటం స్థానికంగా కలకలంరేపింది.
ధర్మ భార్య నీల ఫిర్యాదు మేరకు ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా ఎవరైనా హత్యచేశారా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. సిగ్నళ్ల ఆధారంగా ధర్మ సెల్‌ఫోన్‌ను విశ్లేషించారు. ఈ క్రమంలోనే పోలీసులే నివ్వెరపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ధర్మ సెల్‌ఫోన్ ఆన్‌లోనే ఉండటం అదీ గోవాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి గాలించారు. తాను చనిపోయినట్లు నమ్మించి గోవాలో షికారు చేస్తున్న ధర్మను పోలీసులు గుర్తించారు.
నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో చనిపోయింది మరో వ్యక్తిగా నిర్ధారించారు. ధర్మ బెట్టింగ్‌లు ఆడి అప్పుల పాలయ్యాడని.. బీమా డబ్బులు వస్తే అప్పులు తీర్చొచ్చని భావించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీమా డబ్ముల కోసమే ధర్మ నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు. మరోవ్యక్తిని చంపి కారులో ఉంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నెల5న స్నేహితులతో కలిసి ధర్మ బాసర వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధర్మ దారుణానికి బలైంది తన స్నేహితుడా లేదంటే డ్రైవరా అనే విషయం స్పష్టత రాలేదు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ధర్మను ఇవాళ కోర్టులో హాజరుపరిచేందుకు అవకాశం ఉంది.
ఇన్సూరెన్స్ పాలసీ కోసం అనాథను చంపి ప్రమాదంగా చిత్రీకరించి: రెండేళ్ల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఓ వ్యక్తి కేసులో ఇన్సూరెన్స్ పాలసీ సంస్థ అనుమానం.. నలుగురు నిందితులను పట్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇన్సూరెన్స్ పాలసీ కోసం తన వద్ద పని చేసే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ప్రధాన నిందితుడు సహా సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఊహించని విషయం ఏమిటంటే హత్యకు స్కెచ్ వేసింది ఓ హెడ్ కానిస్టేబుల్. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
2021 డిసెంబర్లో షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో భిక్షపతి అనే వ్యక్తి మృతి చెందాడు. అప్పుడు అనుమానాస్పద వాహనం ఢీకొని మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. భిక్షపతి పేరుపై హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు దానిపై ఉన్న ఇన్సూరెన్స్ క్లైమ్ చేసేందుకు నామినిగా ఉన్న శ్రీకాంత్ కంపెనీకి వెళ్లాడు.
క్లైమ్ దర్యాప్తులో ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అనుమానం రావడంతో షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానంతో బోడ శ్రీకాంత్‌ను విచారించారు. విచారణలో గతంలో అతనిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతనే హత్య చేయించినట్లు గుర్తించారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా.. వీరిలో ఎస్ఓటీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మోతిలాల్ కూడా ఉన్నాడు. కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఇవీ చదవండి: