తనపై, తన సోదరిపై గాంధీ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం చేశారంటూ.. బాధితురాలి ఫిర్యాదుతో నమోదైన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసలు ఐదో తేదీ నుంచి ఏం జరిగింది..? రోగిని చేర్పించి ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారు..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరి ఆచూకీ లభ్యమైతేనే ఈ సందిగ్ధతకు తెరపడే అవకాశం ఉంది. సీసీటీవీ బృందంతో సహా.. ప్రస్తుతం 4 బృందాలు బాధితురాలి సోదరి కోసం గాలిస్తున్నాయి. ఇప్పటికే బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించి పోలీసులు అమెకు చికిత్సను అందించారు. అత్యాచారం జరిగింది అని బాధితురాలు ఫిర్యాదు చేసింది కనుక... ఆమె వైద్య పరీక్షల రిపోర్టులను ఎఫ్ఎస్ఎల్కు పంపారు. మరోవైపు కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న ల్యాబ్ టెక్నిషియన్‌ను.. పోలీసులు విచారిస్తున్నారు. బాధిత మహిళ ఫిర్యాదులో ల్యాబ్ టెక్నిషియన్ ఉమా మహేశ్వర్ ఈనెల 5న బాధితురాలి బావను చేర్పించిన తర్వాత.. రోగి వెంట ఒక్కరే ఉండాలని.. తనని మరో గదికి తీసుకెళ్ళి మత్తుమందు కలిపిన చేతిరుమాలు అడ్డుపెట్టారని పేర్కొంది. ఇంజెక్షన్ తనకు చేసి.. అనంతరం సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఇదే అంశంపై టెక్నిషియన్ ను, సెక్యూరిటీ గార్డును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణలో తాను ఎలాంటి ఆఘాయిత్యానికి పాల్పడలేదని... ఉమా మహేశ్వర్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
వివిధ కోణాల్లో దర్యాప్తు...
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. కేసు వేగంగా దర్యాప్తు చేస్తున్నట్లు గోపాలపురం ఏసీపీ వెంకట రమణ తెలిపారు. అసత్య ప్రచారాలు, వదంతులు నమ్మొద్దన్నారు. కేసులో బాధితురాలు ఆరోపిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని.. మరికొందరిని విచారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన బాధితురాలి బావ వాంగ్మూలం .. రికార్డ్ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. ఈనెల 14న అవుట్ పేషెంట్ బ్లాక్ వద్ద విధులు నిర్వర్తించిన రాము అనే సెక్యూరిటీ గార్డు.. రెండు రోజుల నుంచి విధులకు రావట్లేదు. భయపడి పారిపోయాడా.. లేక ఘటనకు పాల్పడ్డాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. అతని ఆచూకి లభిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. అదృశ్యం అయిన బాధితురాలి సోదరి.. ప్రధాన బ్లాక్ వద్ద ఉన్న సీసీటీవీలో కనిపించింది కానీ.. అక్కడి నుంచి ఎటు వెళ్ళింది అనే దృశ్యాలు మాత్రం పోలీసులకు ఇంకా లభ్యం కాలేదు.
సమగ్ర దర్యాప్తు చేయాలని మంత్రుల ఆదేశం..
గాంధీ ఆసుపత్రి ఆవరణలో మహిళపై అత్యాచార ఘటనలో సమగ్ర దర్యాప్తు చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ... సీపీ అంజనీ కుమార్‌ను ఆదేశించారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మహమూద్ అలీ తెలిపారు. అత్యాచార ఘటనపై ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి హోంమంత్రి సమీక్షించారు. సీపీ అంజనీ కుమార్, అదనపు డీజీ షిఖా గోయల్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటన పట్ల మంత్రులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని... మహమూద్ అలీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని... త్వరలో పట్టుకుంటామని సీపీ అంజనీ కుమార్... మంత్రులకు వివరించారు.
ఇదీ చూడండి:
Gandhi Hospital Rape: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం... పోలీసుల అదుపులో నలుగురు