''స్వశక్తితో ఎదిగి తనకంటూ గుర్తింపు సాధించుకోవాలనుకున్న ఓ మహిళ కల చెదిరిపోయింది. మహిళా పైలట్‌గా రాణించాలన్న ఆమె ఆశను... విధి అడియాశ చేసింది. నల్గొండ జిల్లాలో శిక్షణ విమానం నేలకూలి తమిళనాడుకు చెందిన మహిమ మృతిచెందింది.''
Nalgonda Plane Crash : నల్గొండ జిల్లాలో శిక్షణ విమానం కూలి పైలట్ దుర్మరణం చెందారు. తమిళనాడుకు చెందిన గజరాజ్ కుమార్తె మహిమ.. నాగార్జునసాగర్ సమీపంలోని విజయపురి సౌత్ ఏవియేషన్ అకాడమీలో పైలట్‌గా శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా.. శిక్షణ విమానం 'సెస్నా-152' డబుల్ సీటర్‌లో ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే పెదవూర మండలం రామన్నగూడెం తండా వద్దకు రాగానే.. విమానం అదుపుతప్పి వ్యవసాయ పొలాల్లో కుప్పకూలింది. భారీ శబ్దంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. విమానం ముక్కలు కాగా.. మహిమ మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది.
"మహిమ అనే మహిళా పైలట్ మాచర్లలోని ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీ నుంచి ట్రైనింగ్‌లో భాగంగా ఉదయం 10.30 గంటలకు శిక్షణ విమానంలో హైదరాబాద్ వైపు బయలుదేరింది. నాగార్జునసాగర్ వైపు నుంచి రామన్నగూడెం తండా వద్దకు రాగానే.. గాల్లోనే కంట్రోల్ తప్పి స్పిన్ అయింది. ఉదయం 10.50 గంటల సమయంలో కూలిపోయింది. ఇది సెస్నా 152 అనే ఎయిర్ క్రాఫ్ట్. ఇది టూ సీటర్ ప్లేన్.. దీన్ని ట్రైనింగ్ కోసం వినియోగిస్తారు. ప్రాథమిక విచారణలో మాకు ఈ విషయాలు మాత్రమే తెలిశాయి."
- రెమా రాజేశ్వరి, నల్గొండ జిల్లా ఎస్పీ
సమీపంలో హైటెన్షన్ విద్యుత్ లైన్లు
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ, వైద్యాధికారులు విచారణ చేపట్టారు. మహిమ మృతదేహానికి ఘటనాస్థలంలోనే పంచనామా నిర్వహించారు. విమాన ప్రమాద ఘటనపై పోలీసులతో పాటు డీజీసీఐ విచారణ చేపడుతోందని ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఘటనాస్థలానికి సమీపంలో 133 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్నాయి. విమానం ఈ లైన్లపై కూలి ఉంటే ప్రమాదం మరింత తీవ్రస్థాయిలో ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
Plane Crash at Ramannagudem : "మేము పొలం పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా పిడుగుపడినట్లు పెద్ద శబ్ధం వచ్చింది. ఏమైందోనని చూసేసరికి మా పొలాలకు సమీపంలో ఓ ప్రాంతం నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడం కనిపించింది. ఎవరిదైనా పంట కాలిపోతుందేమోనని పరుగున అక్కడికి వెళ్లాం. చూసేసరికి ఓ విమానం దగ్ధమవుతోంది. అందులో నుంచి అరుపులు వినిపించాయి. ఏం చేయాలో అర్థమయ్యేలోగానే.. అరుపులు రావడం ఆగిపోయాయి. అప్పటికే అందులో ఉన్న వాళ్లు కాలిపోయి ఉంటారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం."
- స్థానిక రైతులు
ప్రమాదంపై కేంద్రమంత్రి విచారం
ప్రమాద ఘటనపై.. కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిక్షణా పైలట్ చనిపోవటం దురదృష్టకరమన్న కేంద్రమంత్రి....కారణాలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.