Timber smuggling in telangana : తెలంగాణాలో కలప స్మగ్లింగ్‌ను అటవీశాఖ కట్టడి చేసింది. దందానే జీవనోపాధిగా మార్చుకున్న మాఫియా పొరుగురాష్ట్రంలోని సరిహద్దు అడవులపై కన్నేసింది. అక్కడి అక్రమార్కులతో జతకట్టి ములుగు జిల్లా వెంకటాపురం అటవీ రేంజి మీదుగా టేకు కలప అక్రమ రవాణాకు పాల్పడుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భీమారం, కొత్తపల్లి అభయారణ్యంలో టేకు చెట్లను రంపపు కోతలతో ముక్కలుగా చేస్తున్నారు. నాణ్యమైన టేకు నిల్వలను తెలంగాణలోని ములుగు, భద్రాద్రి జిల్లాలకు తరలించి దనార్జనకు పాల్పడుతున్నారు.
తెరవెనక సూత్రధారులు.. వెంకటాపురం-భద్రాచలం ప్రధాన మార్గానికి 7 కి.మీ దూరంలో ఉన్న పొరుగురాష్ట్రం అభయారణ్యాన్ని మాఫియా అడ్డాగా మార్చుకుంది. జీవనోపాధి ముసుగు పేరుతో ఆ ప్రాంత వాసులను స్మగ్లింగ్‌కు ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి జిల్లా పినపాక మండలానికి చెందిన ఓ వ్యక్తి, వెంకటాపురం అటవీ క్షేత్రంలోని ఎదిర సెక్షన్ పరిధిలోని ఛత్తీస్‌గఢ్ కొత్తపల్లికి వెళ్లే మార్గం చెంతనే ఉన్న ఓ గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఈ దందాకు కీలక సూత్రదారులుగా తెరవెనక నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రెండు బృందాలను తయారు చేసి రవాణాలో కార్మికులుగా ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రాంతాలు కీలకం.. పొరుగు రాష్ట్రంలో టేకు కలప తక్కువ ధరకే అక్రమార్కులు చేజిక్కించుకుంటున్నారు. నాలుగు నుంచి ఎనిమిది అడుగుల పొడవైన దుంగలను రూ.4 వేల నుంచి రూ.7 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఆ కలపను కొత్తపల్లి అటవీ ప్రాంతం నుంచి పలు మార్గాల ద్వారా వెంకటాపురం అటవీ క్షేత్రంలోని ఎదిర సెక్షన్‌లో విస్తరించి ఉన్న యాకన్నగూడెం, కొండాపురం, రామాంజాపురం, గోదావరి ఫెర్రీల ప్రాంతాల మీదుగా పడవలపై ఆవలి ప్రాంతానికి రహస్యంగా చేర్చుతున్నారు. అక్కడ ఒక్కొ దుంగను రూ.12 నుంచి రూ.14వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అటవీ మార్గాల్లో ట్రాక్టర్ ద్వారా రహస్య ప్రాంతానికి చేర్చుతూ.. అక్కడి నుంచి ఎడ్లబండ్లు, అనధికారిక పడవలను ఉపయోగిస్తున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఎదిరలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఎఫ్‌బీవో నివాస భవనం నిరుపయోగంగానే వెక్కిరిస్తోంది.
దుంగలు చిక్కినా దొంగలు దొరకట్లే.. దొడ్డిదారి దందాపై అటవీశాఖ నిఘా పెడుతున్నా అక్రమార్కులు చిక్కని పరిస్థితి. అడపాదడపా దాడుల్లో టేకు దుంగలు మాత్రమే పట్టుబడుతుండడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ ఏడాది మే 19న సూరవీడు సమీప అటవీ ప్రాంతంలో నిల్వ చేసిన రూ.90వేల విలువైన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎనిమిది టేకు దుంగలను పట్టుకున్నారు. జనవరి 31న యాకన్నగూడెం ఫెర్రీ కేంద్రంగా ఆవలికి తరలించిన రూ.2 లక్షల కలప దుంగలను ఏడూళ్లబయ్యారం అటవీ రేంజి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఎదిర గోదావరి నదిలో, వీరభద్రవరం సమీపంలో సుమారు రూ.2 లక్షల కలపను స్వాధీనం చేసుకున్నా స్మగ్లర్లు చిక్కకపోవడం గమానార్హం.
నిఘాను తీవ్రం చేస్తున్నాం.. "ఛత్తీస్‌గఢ్ అడవులు కేంద్రంగా కలప స్మగ్లింగ్ జరుగుతున్న మాట వాస్తవమే. ఆయా ప్రాంతాలపై అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, స్ట్రైకింగ్ ఫోర్సు నిఘాను పెంచాం. ప్రత్యేకమైన పరిస్థితులు ఉండడంతో పోలీసుశాఖ సహకారం సైతం తీసుకోవాలని నిర్ణయించాం. పూర్తిస్థాయిలో నియంత్రణకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. రాత్రి వేళల్లో గస్తీని పెంచుతాం." - చంద్రమౌళి, ఇన్‌ఛార్జి ఎఫ్‌ఆర్‌వో, వెంకటాపురం