Tiger Attack: మేకలమందపై పెద్దపులి దాడిలో 12 మేకలు మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల మండలంలోని మాల్లోని చెరువు తండాకు చెందిన పట్లవత్ మాన్యనాయక్ తన 12 మేకలను మేపడానికి సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి వెళ్లాడు.
మధ్యాహ్నం భోజనం కోసం ఆ మేకలను పొలంలోనే వదిలేసి ఇంటికి వచ్చాడు. ఆ మేకలు దారితప్పి నల్లమల అడవిలోకి వెళ్లాయి. భోజనం అనంతరం వచ్చిన మాన్యనాయక్.. మేకల కోసం సాయంత్రం వరకు గాలించాడు. మేకల మంద కోసం అటవీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు శుక్రవారం సాయంత్రం వరకు గాలించారు. రాయునిగండ్ల వద్ద 12 మేకలు మృతి చెంది కన్పించాయి. ఫారెస్ట్ బీట్ అధికారులు మొదట చిరుత దాడిగా గుర్తించారు. అనంతరం అక్కడ ఉన్న పాద ముద్రలను గుర్తించి పెద్దపులిగా నిర్ధారించారు. అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేకల విలువ దాదాపు 2.20లక్షల ఉంటుందని బాధితుడు తెలిపాడు. తనకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని వాపోయాడు.
ఇదీ చదవండి: