స్నానం కోసం భద్రాచలం వద్ద గోదావరినదిలో దిగిన ఐదుగురిలో ముగ్గురు మృతి చెందారు. భద్రాచలం అయ్యప్పకాలనీలోని ఓ ఇంట్లో జరిగిన శుభకార్యానికి... ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి కొందరు బంధువులు వచ్చారు. మధ్యాహ్నం పక్కనే ఉన్న గోదావరి నదికి స్నానం చేసేందుకు వెళ్లారు.
ఒక బాలుడు మునిగిపోతుండగా కాపాడే ప్రయత్నం చేసి... మొత్తం ఐదుగురు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు ముగ్గురిని రక్షించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోదావరిలో మునిగి పోయిన బాలుడు, మహిళ మృతదేహాలను బయటకు తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందారు. మొత్తం ఐదుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు మహిళలు భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి: దారుణం: మద్యం మత్తులో అల్లుడిని చంపిన మామ