చుట్టూ తిరిగి కట్టెలు తెచ్చారు. రాళ్లు తెచ్చి పొయ్యి పెట్టారు. వంట చేసేందుకు పొయ్యి, కట్టెలు సిద్ధమయ్యాయి. ఇక వంట చేసుకుందామంటూ.. ఆట మొదలుపెట్టారు ఐదుగురు చిన్నారులు. వంటకు కావాల్సిన సరంజామా అంతా ఎంతో ముచ్చటగా సిద్ధం చేసుకున్నారు. మరి వంట చేయాలంటే నీళ్లు కావాలి కదా.. మేం నీళ్లు తెస్తామని వెళ్లారు. ఎంతో చలాకీగా వెళ్లిన ఆ చిన్నారులు.. కన్నవారికి కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోయారు. గుండెలను కలచివేసే ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీలో జరిగింది.
హైదరాబాద్ కేబీహెచ్బీ నాలుగో ఫేజ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మధ్యాహ్నం ఐదుగురు బాలికలు ఆడుకునే క్రమంలో సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. ఆ ప్రాంతం చిత్తడిగా ఉండటంతో పన్నెండేళ్ల సంగీత... కాలు జారి గుంతలో పడిపోయింది. ఆమెను కాపాడే క్రమంలో ఏడేళ్ల రమ్య, పదేళ్ల సోఫియా నీటిలో మునిగిపోయారు. నేహా అనే బాలిక నీటిలో పడే క్రమంలో చెట్టును పట్టుకొని బయటికొచ్చింది. నవ్య అనే బాలిక అప్పటికే సెల్లార్ ఒడ్డున ఉంది. సెల్లార్ చుట్టూ బారికేడ్లు ఉన్నా... చిన్న సందులోంచి పిల్లలు లోనికి వెళ్లారని పోలీసులు తెలిపారు.
ఉద్రిక్త పరిస్థితులు..
గతంలోనూ ఇదే గుంత వద్ద ఈ తరహా ఘటనలు జరిగాయి. వేర్వేరు ఘటనల్లో సెల్లార్ గుంతలో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరో ముగ్గురి మరణంతో... బాలికల కుటుంబాలతోపాటు కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం సదరు స్థలం గృహనిర్మాణ సంస్థ ఆధీనంలో ఉంది. పదేళ్ల క్రితం గుంత తవ్వి వదిలేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు హౌసింగ్ బోర్డుకు ఫిర్యాదు చేసినా... బారికేడ్లు, రేకులు వేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. బాలికల మృతదేహాలను తరలించకుండా అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఘటనాస్థలానికి వచ్చిన అంబులెన్స్ అద్దాలు ధ్వంసం చేయడంతో... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంతను పూర్తిగా పూడ్చకుంటే ఊరుకోబోమని కాలనీవాసులు హెచ్చరించారు.
ఘటనా స్థలికి మాధవరం..
ఘటనాస్థలాన్ని పరిశీలించిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గతంలో ఘటనలు జరిగినప్పుడే చర్యలు చేపట్టామని అయినా ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికే ఈ గుంతలో పడి ఐదుగురు బలయ్యారని.... అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కేపీహెచ్‌బీ కాలనీవాసులు మొరపెట్టుకున్నారు.
ఇదీ చూడండి: