ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ముకుందపురానికి చెందిన ఎర్రల రమేష్ కుమారుడు వినయ్ బీటెక్ చదివాడు. ఖమ్మంలోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో అక్కడే ఓ విద్యార్థినిని ప్రేమించాడు. భేదాభిప్రాయాలు రావడంతో ఆమె... అతన్ని దూరంగా ఉంచింది.
యువతి కాదన్నదని...
మనోవేదనతో వినయ్ వారం రోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ నెల 5న ఖమ్మం వెళ్లి, స్నేహితుల సాయంతో ఆమెతో ఫోన్‌లో మాట్లాడాడు. తనను ఇబ్బంది పెడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ ఆమె తేల్చిచెప్పడంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. మంగళవారం ఉదయం తండ్రికి ఫోన్ చేసి తాను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే రైల్వే ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్ ప్రాంతంలో రైలు కిందపడి వినయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నన్ను క్షమించండి
యువతి కాదన్నదనే క్షణికావేశంలో 24 ఏళ్లుగా తన మీదే ఆశలు పెట్టుకొని జీవిస్తున్న తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిల్చాడు. 'అమ్మానాన్న... నన్ను క్షమించండి... మీరు జాగ్రత్త' అంటూ తన చరవాణిలో స్టేటస్ పెట్టుకున్నాడని మృతుడి సన్నిహితులు తెలిపారు. ఎదిగిన కొడుకు అండగా ఉంటాడనుకున్న ఆ తల్లిదండ్రులు... బిడ్డ అర్ధాంతరంగా ఊపిరి తీసుకోవడంతో శోక సంద్రంలో మునిగారు. యువకుడి ఆత్మహత్యతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: CHALLANS: తప్పులు తెలుసుకొని.. సరిదిద్దుకుంటారనే జరిమానాలు!