మృత్యవు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు.. అలా ఓ బాలుడిని డోర్ కర్టెన్(Door Curtain) యమపాశమై బలి తీసుకుంది. కర్టెన్ మెడకు చుట్టుకుని 11 బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో జరిగింది. మెదక్ జిల్లా తుఫ్రాన్‌కు చెందిన సామల శ్రీనివాస్, శాంతి దంపతులు, పది ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ఘట్కేసర్కు వచ్చి బ్రూక్‌బండ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు భార్గవ్(11)తోపాటు 3, 5 ఏళ్లు వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాస్ టీవీ రిపేరింగ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. శాంతి వంట మనిషిగా పని చేస్తోంది.
కొవిడ్ కారణంగా పాఠశాలలు మూసివేయటంతో ఐదో తరగతి చదువుతున్న భార్గవ్ ఇంటి వద్దే ఉంటున్నారు. గురువారం శ్రీనివాస్ టీవీ రిపేరింగ్ సెంటర్‌కు వెళ్లగా.. శాంతి ఇళ్లలో వంట చేసేందుకు వెళ్లింది. వెళ్లే ముందు చెల్లెళ్లను చూసుకోవాలని భార్గవ్‌కు చెప్పి వెళ్లింది. భార్గవ్ ఇంటి తలపులకు లోపల నుంచి గడియ పెట్టి సోదరీమణులతో ఆడుకుంటున్నాడు. మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఇంట్లో నుంచి గట్టిగా పిల్లల అరుపులు వినిపించటంతో చుట్టు పక్కల వారు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.
లోపల నుంచి తలపులకు గడియ ఉండటంతో తల్లిదండ్రులు, 100 నెంబరు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తలపులను పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే భార్గవ్ మెడకు డోర్ కర్టెన్ బిగించి ఉంది. వెంటనే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి బాబును తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆడుకుంటున్న సమయంలో డోర్ కర్టెన్ మెడకు చుట్టుకొని ఉంటుందని సీఐ ఎన్.చంద్రబాబు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఎలక్ట్రానిక్ వాహనాల రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి