Tragedy in holi celebrations: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఎవరేనా ముఖేష్ (సిద్ధూ) అనే బాలుడు స్నేహితులతో కలిసి హోలీ ఆటలు ఆడుకొని స్నానానికి వెళ్లి మృతి చెందాడు. బాలుడి మరణంతో కుటుంబ సభ్యుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
ఏం జరిగిందంటే..
హోలీ పండుగ సందర్భంగా ఎనిమిదో తరగతి చదువుతున్న ఎవరేనా ముఖేష్ (సిద్ధూ) స్నేహితులతో కలిసి హోలీ ఆడుకొని స్నానానికి సమీపంలోని వాగులోకి వెళ్లాడు. బొక్కల వాగులో చెక్ డ్యాం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని రోజులుగా జేసీబీ సాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడంతో వాగులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల్లో నీరు నిలవడంతో స్నానం చేయడానికి వచ్చిన ముఖేష్ ప్రమాదవశాత్తు కందకం నీటిలో మునిగి మృతి చెందాడు.
ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. స్థానికంగా ఉన్న జేసీబీని ధ్వంసం చేశారు. అక్కడి నుంచి బాలుడి మృతదేహాన్ని మంథని అంబేడ్కర్ చౌరస్తాకు తీసుకువచ్చారు. అక్కడ టెంట్ వేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. సుమారు రెండు గంటల నుంచి రోడ్డుపైన మృతదేహంతో ధర్నా చేయడంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.
ఇదీ చదవండి:Heart Attack While Driving: ట్రాక్టర్ డ్రైవర్‌కు గుండెపోటు.. ముగ్గురు మృతి