Student Suicide in Madhapur: రెండు రోజుల క్రితం తీగల వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన విద్యార్థి నిఖిల్ మృతదేహం ఈరోజు దుర్గం చెరువులో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఈ నెల 13న తీగల వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి మాయమయ్యాడు.
మాదాపూర్కి చెందిన ఈ బాలుడు కళాశాలకి వెళ్లొచ్చాడు. పుస్తకాల సంచి తండ్రి నిర్వహిస్తున్న ఇంటర్ నెట్ కేంద్రంలో ఉంచి బయటకి వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి గానీ, ఇంటర్నెట్ కేంద్రానికి రాకపోకడంతో ఆందోళనకు గురైన తండ్రి బుద్ధవనం సునీల్ కుమార్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. అనంతరం కుమారుడి పుస్తకాల సంచి వెతకగా.. 'నేను ఇవాళ 8 గంటలకు తీగల వంతెన నుంచి దూకుతున్నా.. బతికి ఉంటే ఈ లెటర్ అవసరం లేదు. మరణిస్తే నా ఫోన్ కాంటాక్ట్స్లో ఉండే అందరికీ సమాచారం పంపండి. నా చావుకు ఎవరు కారణం కాదు అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించిందని' పోలీసులు తెలిపారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దుర్గం చెరువు పరిసర ప్రాంతాలలో ఆ రోజు నుంచి వెతికినా ఆచూకీ లభించలేదు. మరో దపా ఈ రోజు ఉదయం దుర్గం చెరువులో గాలింపు చర్యలు చేపడుతుండగా అతని మృతదేహం లభ్యమైందని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మానసిక ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:కోలుకున్నా.. బిల్లు కట్టలేక.. ఆసుపత్రిలోనే ఆత్మహత్య