రోజూలాగే ఆరోజు అందరితో కలిసి భోజనం చేశాడు. ఎప్పటిలాగే తినేసి తన గదిలోకి వెళ్లాడు. బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్రలేవలేదేంటని చూద్దామని వెళ్లిన తల్లికి.. గదిలో కుమారుడు కనిపించలేదు. పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్లి ఉంటాడని వెతికారు. చుట్టుపక్కల స్నేహితులను అడిగారు. ఎక్కడా కనబడకపోయేసరికి.. ఇంటిపై రెండో అంతస్తుకి వెళ్లారు. అక్కడ ఉరితాడుకు వేలాడుతున్న కుమారుడిని చూసి ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. ఏం జరిగిందో అర్థంగాక క్షణకాలం అయోమయానికి గురయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్లెదుట నిర్జీవంగా పడి ఉండటం చూసి గుండెలవిసేలా రోదించారు.
సికింద్రాబాద్ అల్వాల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భూదేవి నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. అర్థరాత్రి సమయంలో.. ఇంటిపై రెండో అంతస్తుకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఉదయాన్నే కుమారుడి కోసం వెతికిన తల్లిదండ్రులకు ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.
తల్లిదండ్రుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం అరుణ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అరుణ్ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండేది కాదని అతని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. బాలుడు.. మానసిక అనారోగ్యం వల్లే చనిపోయాడా.. లేక మరేదైనా కారణం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కుమారుడు.. కళ్లెదుట నిర్జీవంగా పడిఉండటం చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి కడుపుకోత చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు.
నిన్నటిదాకా తమతో కలిసి తిరిగి.. ఆడుకున్న స్నేహితుడు కానరాని లోకాలకు వెళ్లడం అరుణ్ మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ స్నేహితుడు తిరిగి రాలేడని తెలిసి.. కన్నీటి పర్యంతమయ్యారు.