Tension at Kallur Police Station: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కల్లూరులో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. సదుం మండలం బూరగమందకు చెందిన తెదేపా కార్యకర్త రాజారెడ్డిపై.. వైకాపా కార్యకర్తలు సోమవారం దాడి చేశారు. ఈ దాడిని వ్యతిరేకిస్తూ నేడు నిరసనలకు తెదేపా పిలుపునిచ్చింది. ఈ నిరసనల్లో రాజంపేట తెదేపా నేత శ్రీనివాసులరెడ్డి, పుంగనూరు ఇన్‌ఛార్జి చెల్లబాబు, నరసింహ యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
నిరసనల్లో భాగంగా కల్లూరు పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరుతుండగా.. నగరిపల్లిలో తెదేపా నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నల్లారి కిశోర్ గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ.. నగరిపల్లిలో తెదేపా ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలోనే పోలీసులు తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కల్లూరు పీఎస్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: 'భూ సేకరణ చేయకుంటే నాదీ పురుగుల మందు తాగాల్సిన పరిస్థితే'