Chain snatching in kamareddy: కిరాణా దుకాణం నిర్వహించే ఓ మహిళ కళ్లలో కారం చల్లి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని అపహరించుకుని వెళ్లేందుకు యత్నించాడు ఓ దొంగ. అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో మహిళ ధైర్యం చేసి చాకచక్యంగా అతడిని అడ్డుకుంది. అంతే కాదు అతని దగ్గర ఉన్న కారంతోనే ఆ దొంగకు బుద్ధి చెప్పింది. అనంతరం గట్టిగా అరిచి స్థానికులకు సమాచారం అందించింది. వారంతా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
మహిళ చాకచక్యం
పట్టణంలోని శివాజీ రోడ్డు చౌరస్తాలో కృష్ణమూర్తి అనే వ్యక్తి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయంలో అతని భార్య షాపులో ఉండగా... అప్పుడే అక్కడికి ఓ గుర్తు తెలియని వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని బైక్పై వచ్చాడు. జేబులో చేతులు పెట్టి డబ్బులు ఇస్తున్నట్లు నటించి షాపులో వస్తువులు కావాలని అడిగాడు. దాంతో ఆమె సరుకులు ఇస్తుండగానే తన జేబులో నుంచి కారం పొడి తీసి ఆ మహిళ కళ్లలో చల్లాడు. వెంటనే ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని బైకుపై పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆదే సమయంలో సరుకుల కోసం అక్కడికి వచ్చిన స్థానికురాలు భారతి.. ఆ దొంగను అడ్డుకొని అతని జేబులోని కారం తీసి అతని కళ్లలోనే కొట్టింది. అనంతరం కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
చావు దెబ్బలు తిన్నాడు..
స్థానికులు ఆ దొంగ నెత్తిపై కారం చల్లి.. అతని బట్టలు విప్పించి కారం చల్లుతూ దేహశుద్ధి చేశారు. దొంగిలించిన మంగళసూత్రాన్ని బాధిత మహిళకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వార్డు కౌన్సిలర్లు పిట్ల వేణు, కన్నయ్యలు స్థానికులను సముదాయించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి దొంగను పోలీసులకు అప్పగించారు. ధైర్యంగా దొంగను అడ్డుకుని పట్టించిన సదరు మహిళను స్థానికులు అభినందించారు.
ఇదీ చదవండి: Puvvada comments on bjp: 'ప్రభుత్వంలో ఉన్నందునే సహనంతో ఉన్నాం'