Theft in Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మరో దొంగతనం వెలుగులోకి వచ్చింది. పట్టపగలే ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. శ్రీరాంనగర్ కాలనీలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించిన గంటల వ్యవధిలోనే మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గాయత్రి నగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. కాలనీకి చెందిన కుర్రి సుభాష్ ఇంట్లో 15 తులాల బంగారం, రూ. లక్షా 16 వేల నగదును దోచుకెళ్లారు.
పూజకు వెళ్లి వచ్చే లోపల
బుధవారం.. కుర్రి సుభాష్ కుటుంబం సిద్దిపేటలోని తమ బంధువుల ఇంట్లో పూజ కార్యక్రమానికి వెళ్లారు. గురువారం సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ప్రధాన గేటు బయటకు తాళం వేసి ఉండగా లోపలి నుంచి కూడా తాళం వేసి ఉన్నట్లు సుభాష్ పేర్కొన్నారు. ఇంటి వెనక వైపు వెళ్లి చూడగా.. అక్కడ ఓ తలుపు తెరిచి ఉండటాన్ని గమనించామని తెలిపారు. లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో బీరువాలోని సామగ్రి చిందరవందరంగా పడేసి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేసినట్లు చెప్పారు. రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.
సీసీ కెమెరాలు ఉన్నా
బీరువాలో ఉన్న బంగారం, షెల్ఫ్‌లో ఉంచిన నగదు చోరీకి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంటి లోపలికి వెళ్లి గడియ పెట్టుకుని దొంగతనం చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఇంట్లో ఏదో అలికిడి అయినట్లుగా శబ్ధం వినిపించిందని కాలనీ వాసులు పేర్కొన్నారు. కానీ ఇంటి సభ్యులు ఊరికి వెళ్లిన విషయం తమకు తెలియదని చెప్పారు. కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నా.. ఇటీవలే అవి పనిచేయకుండా పోయాయని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Financial Frauds: సామాన్యుల ఆశలే పెట్టుబడి.. అడుగడుగునా మోసగాళ్ల అలజడి