Cyber Crime in Telangana: 73 సైబర్ నేరాలు చేసి ఝార్ఖండ్ పోలీసులకు పట్టుబడిన సైబర్ నేరగాళ్లను తెలంగాణకు తరలించేందుకు నేడు రాష్ట్ర పోలీసులు ఝార్ఖండ్‌కు చేరుకున్నారు. 19 సెప్టెంబర్ 2021 న, ఝార్ఖండ్‌లోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది సైబర్ నేరగాళ్లను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై
ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ధన్‌బాద్ జైలుకు తరలించారు. వీరంతా తెలంగాణలో నమోదైన 73 సైబర్ నేరాల్లో నిందితులుగా ఉన్నారు. సదర్ పోలీసుల సమాచారం మేరకు రాష్ట్ర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పొందిన అనంతరం వారిని తెలంగాణ పోలీసులకు అప్పగించనున్నారు.
మోసాల్లో రాటుదేలారు
అరెస్టయిన సైబర్ నేరగాళ్ల నుంచి 24 మొబైల్స్, సిమ్‌లను ఝార్ఖండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు నోట్‌బుక్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ ద్వారా నిందితులు తెలంగాణలో సైబర్ మోసాలకు పాల్పడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. విచారణలో ఈ నేరగాళ్లు పది కేసులను మాత్రమే అంగీకరించినట్లు వెల్లడించారు. కానీ తమదైన శైలిలో విచారణ చేపట్టగా మొత్తం 73 మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి బీహార్‌లోని గయాకు చెందిన విక్రమ్ అని వివరించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో భారీ చోరీ.. 2 కిలోల నగలు, 25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు