TDP leader suffered with heart attack: తమ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలు తొలగిస్తున్నారని అభ్యంతరం చెప్పిన ఇద్దరు తెదేపా నాయకులను బాపట్ల జిల్లా ఈపూరుపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రాత్రి వరకు స్టేషన్‌లోనే ఉంచి విచారిస్తుండగా ఒకరికి గుండెనొప్పి రావటంతో చీరాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యుడు ఎం.ఎం.కొండయ్య ఆధ్వర్యంలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా గవినివారిపాలెంలో ఆదివారం పర్యటించారు. ఈ కార్యక్రమం కోసం తెదేపా నాయకులు, ఫ్లెక్సీలు, తోరణాలు కట్టారు. స్థానిక వైకాపా నాయకుల ప్రోద్బలంతో సోమవారం ఉదయం పంచాయతీ సిబ్బంది వీటిని తొలగిస్తుండగా తెదేపా నాయకులు ఎన్.నాగరాజు, ఎన్.వెంకటేశ్వర్లు అభ్యంతరం తెలిపారు.
పంచాయతీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈపూరుపాలెం పోలీసులు వచ్చి వారిద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నియోజకవర్గ బాధ్యుడు కొండయ్య, అమర్‌నాథ్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో మాట్లాడారు. అయినా రాత్రి వరకు నాగరాజు, వెంకటేశ్వర్లును పోలీసులు స్టేషన్‌లోనే ఉంచారు. రాత్రి నాగరాజుకు గుండెనొప్పి రావటంతో ఆసుపత్రికి తరలించారు. విచారణ పేరుతో బెదిరించడంతోనే నాగరాజు కుప్పకూలిపోయాడని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో వెంకటేశ్వర్లును పోలీసులు విడిచిపెట్టారు.
ఇవీ చదవండి: