దుబాయి నుంచి బంగారం బిస్కెట్లు తెచ్చారు. కస్టమ్స్ అధికారులకు కనిపించకుండా వాటిని నల్ల కాగితంలో చుట్టి ఫోన్స్ బాక్స్ లాంటి పౌచ్‌లో ఉంచారు. ఎలాగో కస్టమ్స్ అడ్డంకి దాటేశారు. కానీ ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడ విమానాశ్రయం బయట టాస్క్‌ఫోర్స్ పోలీసులకు దొరికేశారు. ఈ ఘటన విజయవాడ విమానాశ్రయం సమీపంలో బుధవారం జరిగింది.
ఏపీలోని కడపకు చెందిన షేక్ మహమ్మద్ నవీద్ బాషా అనే వ్యక్తి 1.6 కిలోల బరువున్న బంగారాన్ని దుబాయి నుంచి తీసుకొచ్చాడు. కస్టమ్స్ కళ్లుగప్పి బయటకు వచ్చి కడపకు చెందిన మరో ఇద్దరితో కలిసి కారులో విమానాశ్రయం బయలుదేరారు. కానీ, బయటే టాస్క్‌ఫోర్స్‌కు దొరికేశారు. విజయవాడలో ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవరుగా పనిచేసే నవీద్ బాషా ఫిబ్రవరి 6 న దుబాయి వెళ్లాడు. అక్కడ నుంచి బంగారం బిస్కెట్లు తీసుకుని 16న రాత్రి విజయవాడ విమానాశ్రయంలో దిగాడు. బయటకు వచ్చిన అతడిని తీసుకెళ్లేందుకు షేక్ ఇబ్రహీం, మహ్మద్ గౌస్ కారులో వచ్చారు. వీరు ముగ్గురూ కలిసి వెళ్తుండగా.. ముందుగా అందిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గేటు వద్ద ఆపి తనిఖీ చేయగా బంగారం గుట్టు రట్టయింది.
ఏమిటా నల్లకాగితం..?
విమానాశ్రయంలో కస్టమ్స్‌కు దొరకకుండా బంగారం బయటకు ఎలా తెచ్చారన్నదీ ప్రశ్నగానే మిగిలింది. నల్లకాగితంలో చుట్టడం వల్లే దొరికి ఉండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కాగితంపై విచారణ చేస్తున్నారు. నిందితులను ఆరా తీయగా కడపకు చెందిన షేక్ మహమ్మద్ ఆలీ అనే వ్యక్తి సూచనతో విజయవాడకు కారులో వచ్చామని మహమ్మద్ గౌస్, షేక్ ఇబ్రహీం చెబుతున్నారు. అతను ఎవరనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. బంగారం విషయం కూపీ లాగేందుకు నిందితులను గన్నవరం పోలీసులకు అప్పగించారు.