Suspicious Death of Student: ఏపీలోని తిరుపతిలో బీ ఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతున్న యువతి.. శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలోని ఓ వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రియుడుగా చెబుతున్న వ్యక్తికి సంబంధించిన వ్యవసాయ షెడ్డులో ఉరి వేసుకొని చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఆమె మరణవార్త వెలుగుచూసింది. యువతి తల్లిదండ్రులు మాత్రం ప్రేమ పేరుతో నమ్మించి తమ బిడ్డను హత్య చేశారని ఆరోపించారు. మాయమాటలతో తిరుపతి కాలేజీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తన సొంత వ్యవసాయ పొలంలోని షెడ్డుకు పిలిపించి.. హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాచారం తెలుసుకున్న గోరంట్ల పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగుల కొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం.. గోరంట్ల పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
యువతి మృతిపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఏపీ సీఎం జగన్ చేతకాని పాలనలో.. మహిళలపై ప్రతిరోజు అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆరోపించింది. బీఫార్మసీ విద్యార్థినిని హత్యాచారం చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మృతదేహాంతో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకి దిగితేగానీ పోలీసులు స్పందించకపోవడం ఘోరమని మండిపడ్డారు. బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయి అఘాయిత్యానికి బలైతే, బాధితకుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తాము కోరడం యాగీ చేయడం కాదని ముఖ్యమంత్రికి చంద్రబాబు చురకలంటించారు. ఆడబిడ్డని కోల్పోయిన తల్లి న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట వేడుకుంటున్నా.. కనికరించట్లేదని నారా లోకేశ్ దుయ్యబట్టారు. వైకాపా మూడేళ్ల పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరగని రోజు లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవటం వల్లే రాష్ట్రంలో ఉన్మాదులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. హత్యాచారం చేసిన నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరోసారి శవపరీక్ష: బి.ఫార్మసీ విద్యార్థిని మృతదేహానికి ఇవాళ మరోసారి శవపరీక్ష నిర్వహించనున్నారు. ప్రేమికుడే హత్య చేశాడని యువతి తల్లిదండ్రులు, మృతురాలి బంధువుల ఆరోపణలతో మరోసారి శవపరీక్ష చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: ఇడ్లీ తినలేదన్న కోపంతో.. యాచకున్ని హత్య చేశారు..!