Father Killed His Kids in Nagarkurnool : కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లల గొంతుకోసి హత్య చేశాడో వ్యక్తి. ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులోని గుట్టపై ఈ ఘటన చోటుచేసుకుంది. కుడికిల్లకు చెందిన ఓంకార్‌కు అదే గ్రామానికి చెందిన మహేశ్వరితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు చందన (3), విశ్వనాథ్ (1) ఉన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానంటూ నమ్మబలికిన ఓంకార్ ఇద్దరు పిల్లలు, భార్యను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు.
కొల్లాపూర్ నుంచి పెద్దకొత్తపల్లి దారిలో వస్తుండగా, భార్యభర్తలిద్దరికీ గొడవ జరిగింది. చంపుతానంటూ బెదిరించడంతో మహేశ్వరి ద్విచక్ర వాహనం నుంచి కిందకు దూకింది. ఓంకార్ ఇద్దరు పిల్లలతో కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులోని గుట్ట వద్దకు వెళ్లాడు. ద్విచక్ర వాహనాన్ని సమీపంలోని పొలం వద్ద వదిలేసి పిల్లలను గుట్టపైకి తీసుకుపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో పిల్లల గొంతు కోశాడు. అనంతరం తానూ గొంతుకోసుకొని కిందకు వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మహేశ్వరి పారిపోయి పెద్దకొత్తపల్లి ఠాణాలో పోలీసులను ఆశ్రయించింది. భర్త ఇద్దరు పిల్లలను తీసుకెళ్లాడని వారిని చంపుతానని బెదిరించాడని తెలిపింది.
ఓంకార్ చరవాణి లొకేషన్ ఆధారంగా వెదికిన పోలీసులకు గుట్టపై పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలం వద్ద కత్తి స్వాధీనం చేసుకున్నారు. పిల్లల మృతదేహాలపై పడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు కంటతడిపెట్టించింది. ఓంకార్‌ను నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అనుమానంతోనే..: ఓంకార్ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు కుమారుడు ఉన్నాడు. రెండో భార్యకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఆమె విడిపోవడంతో మహేశ్వరిని మూడో పెళ్లి చేసుకున్నాడు. మహేశ్వరికి కూడా ఇది రెండో వివాహం. నిత్యం అనుమానంతో భార్యతో గొడవ పడేవాడని గ్రామస్థులు వివరించారు. ఈ పిల్లలు తనకు పుట్టలేదని ఆపరేషన్ చేయించుకోకుండా మరో కాన్పు వరకు ఉండాలని మహేశ్వరి వద్ద ఓంకార్ పట్టుబడుతున్నాడని... ఈ క్రమంలోనే దారుణం జరిగిందని వారు తెలిపారు. బతుకుతెరువు కోసం విజయవాడకు వెళ్లి పది రోజుల కిందటే ఊరికి వచ్చారని బంధువులు తెలిపారు.