Predatory loan apps ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్ రుణయాప్‌ల ఆగడాలకు అడ్డేలేకుండాపోతోంది. అవసరం లేకున్నా పదేపదే ఫోన్‌లు చేసి రుణం తీసుకునేలా ప్రేరేపించడం.. ఆ తర్వాత సకాలంలో చెల్లించలేదంటూ వేధింపులకు దిగడం ఆ రాష్ట్రంలో పరిపాటిగా మారింది. వడ్డీలకు చక్రవడ్డీలు విధించి ఇచ్చిన దానికన్నా రెట్టింపు వసూళ్లకు పాల్పడటంతో పాటుగా... తిరిగి చెల్లించని వారి ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి బంధువులు, స్నేహితులకు పంపి పైశాచికానందం పొందుతున్నారు. వీరి బాధలు భరించలేక చాలామంది మానసికంగా కుంగిపోతుండగా.. మరికొందరు బలవంతంగా తనువు చాలిస్తున్నారు. ఇటీవలకాలంలో వీరి ఆగడాలు మరింత పెరిగిపోవడంతో మూడు నెలల కాలంలోనే ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన కోన సతీష్, మచిలీపట్నానికి చెందిన ప్రత్యూష, అన్నమయ్య జిల్లా మేడికుర్తికి చెందిన యశ్వంత్‌కుమార్ బలవన్మరణం చెందారు. రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆర్థిక ఇబ్బందులతో రుణయాప్ నుంచి అప్పు తీసుకుని.. తిరిగి చెల్లించకపోడంతో వారి అశ్లీల దృశ్యాలను తయారుచేసి.. అందరికీ పంపిస్తామంటూ వేధించడంతో.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఇద్దరి పిల్లలూ అనాథలయ్యారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో శివ అనే యువకుడు ఉరివేసుకుని చనిపోయాడు.
వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చంటూ ఆశ ఎలాంటి హామీ లేకుండా రుణాలిస్తామంటూ ఫోన్లు చేసి.. నిరుపేదలను రుణయాప్‌ల ద్వారా అప్పుల ఊబిలోకి దింపుతున్నారు. వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చంటూ ఆశపెడుతున్నారు. మరికొందరిని చేర్చితే కమీషన్ ఇస్తామంటూ రుణయాప్ నిర్వాహకులు విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చిరువ్యాపారులు, గృహిణులు, కళాశాల విద్యార్థులను వీరు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. చెల్లింపు గంట ఆలస్యమైనా యాప్ నిర్వాహకుల నుంచి తీవ్రమైన బెదిరింపులు ఎదురవుతున్నాయి. డబ్బు తిరిగి చెల్లించినా ఇంకా ఇవ్వాలంటూ వేధిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బు చెల్లించకుంటే ఫోటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీలంగా మార్చి.. బంధుమిత్రులకు పంపుతారు. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ... అసభ్య సందేశాలను జతచేస్తారు. తీవ్ర మనస్తాపానికి గురవుతున్న బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
పోలీసులు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు నమోదుచేసిన కేసులు రుణయాప్‌ల అరాచకాలు, వేధింపులపై రాష్ట్ర పోలీసులు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు.. 63 కేసులు నమోదుచేశారు. తిరుపతి, గుంటూరు, విశాఖ, తూర్పుగోదావరి యూనిట్ల పరిధిలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వీటిలో 95 శాతం కేసుల్లో దర్యాప్తే ముందుకు సాగట్లేదు. ఈ తరహా కేసులన్నింటినీ ఒకేతాటికి చేర్చి.. రాష్ట్ర స్థాయిలో ఒకరిద్దరు సీనియర్ ఐపీఎస్‌ల నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం, ఆయా యాప్‌ల మూలాలు, వాటి కాల్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టడం వంటివేవీ జరగట్లేదు. అప్పులు తీసుకున్న వారిని బెదిరించేందుకు యాప్ నిర్వాహకులు ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఫోటోల్ని నగ్నంగా, అశ్లీలంగా మార్చడానికి మరికొన్ని బృందాలు పనిచేస్తున్నాయి. వీరిలో ఎక్కువమంది అసాంఘిక శక్తులే. కానీ పోలీసులు వారి ఆచూకీ గుర్తించి, చర్యలు తీసుకోలేకపోతున్నారు.
చాలా సందర్భాల్లో రుణయాప్‌ల వేధింపులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదులిస్తున్నా.. తేలిగ్గా తీసుకుంటున్నారే తప్ప కేసు నమోదు చేయట్లేదు. రుణయాప్‌ల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని F.I.R.ల్లో ప్రస్తావించట్లేదు. ఇలాంటి రుణయాప్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మన జాగ్రత్తే మనకు రక్ష అంటున్నారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులను డౌన్‌లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేస్తున్నారు. రుణయాప్‌ల వేధింపులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదలకోసం 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
ఇవీ చదవండి: