తెలియని వ్యక్తులతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం పెంచుకుని వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంపిస్తూ వారి వలలో చిక్కుకుంటున్నారు యువతులు. తాజాగా మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాలకు చెందిన ఓ యువతి అలాగే చిక్కుకుంది. వరంగల్‌కు చెందిన సుదీప్ కుమార్ యువతికి ఇన్‌స్టాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడంతో ఆ యువతి అంగీకరించింది. తరచూ చాటింగ్ చేసుకున్న అనంతరం ఆ యువకుడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మాయమాటలు నమ్మి తన ఫోన్ నెంబర్ ఇవ్వడం ఇద్దరూ వీడియో కాల్స్‌తో పాటు వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసింది ఆ యువతి.
తనకు డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని సుదీప్ ఆ యువతిని బ్లాక్మెయిల్ చేశాడు. యువతి భయపడి వివిధ దశల వారీగా సుమారు లక్షా 30 వేల నగదు అతడికి పంపించింది. ఇక్కడితో ఆగకుండా ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో యువతి తన తండ్రికి విషయాన్ని తెలిపింది. ఆమె తండ్రిని కూడా యువకుడు బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతడి బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నట్లు పేట్‌బషీరాబాద్ సీఐ రమేశ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిలు వ్యక్తిగత విషయాలు షేర్ చేయొద్దని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: ఈబిజ్ డాట్ కామ్ కేసు.. వెలుగులోకి కొత్త నిజాలు