ఓ బాలుడిని సవతి తండ్రే అతి దారుణంగా కొట్టి చంపిన(Telangana Crime News) ఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్‌కు చెందిన నరసింహులు, అరుణను పదకొండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేళ్ల జాన్‌పాల్, ఏడు సంవత్సరాల జస్వంత్, అరుణ్‌కుమార్(6)లు ఉన్నారు. నరసింహులు తాగుడుకు బానిసై ఏడాది క్రితం మృతి చెందాడు. ఇతను చనిపోక ముందు అరుణకు గద్వాల్‌లోని తిరుమల కంపెనీలో పనిచేస్తుండగా వినయ్‌తో పరిచయం ఉండటంతో అరుణ, వినయ్ కలిసి ఉండేవారని ఎస్సై రామునాయుడు తెలిపారు. నెల క్రితం వారు పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ పద్మానగర్‌కు బతుకుదెరువుకు వచ్చి ఫెన్నార్ పరిశ్రమలో పనిచేస్తున్నారు.
మొదటి నుంచి అంతే..
మొదటి నుంచి అరుణ్‌కుమార్ అంటే వినయ్‌కు ఇష్టం ఉండేది కాదని... ప్రతి చిన్న విషయానికి కొట్టేవాడని బాలుడి తల్లి అరుణ తెలిపారు. 'నువ్వు అలా కొడితే నేను వెళ్లిపోతానని' బెదిరించడంతో కొంతకాలం ఏమీ అనలేదని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం లాగులో మలవిసర్జన చేసుకున్నాడనే నెపంతో తీవ్రంగా కొట్టాడని వాపోయారు. పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతానని వినయ్‌తో గొడవపడగా... ఇది మనసులో పెట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్డు తొలగించుకోవాలనే..
అరుణ్‌కుమార్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అరుణ పరిశ్రమలో విధులకు వెళ్లగా బాలుడిని సవతి తండ్రి తీవ్రంగా కొట్టాడని ఎస్సై రామునాయుడు వెల్లడించారు. సాయంత్రం బాలుడు స్పృహ తప్పిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో బాలుడిని ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. తల్లి వచ్చి చూసేసరికి చిన్నకుమారుడు చనిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Naga Shaurya farm house case: పోలీస్ స్టేషన్‌కు నేడు హీరో నాగశౌర్య తండ్రి