Step Mother Killed Step Son : అభం శుభం తెలియని చిన్నారిని కాపాడాల్సిన సవతి తల్లి కర్కశంగా వ్యవహరించింది. వేధిస్తుంటే తండ్రికి ఫిర్యాదు చేస్తున్నాడని భవనం పైనుంచి తోసింది. బతికి బయటపడ్డాడని గొంతు నులిమి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది.
సీఐ హబీబుల్లాఖాన్ వివరాల ప్రకారం... నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లికి చెందిన భాస్కర్ భార్య రత్నమాల ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటికే వారికి ఏడాది వయసున్న ఉజ్వల్ కుమారుడు ఉన్నాడు. భాస్కర్ సరిత(31)ను రెండో వివాహం చేసుకున్నాడు. భార్య, కుమారుడు సహా రెండేళ్ల కిందట నగరానికి వచ్చాడు. గోల్నాకలో అద్దె ఇంట్లో ఉంటూ.. మేస్త్రీ పని చేస్తున్నాడు. ప్రస్తుతం వీరికి ఆర్నెల్ల పాప ఉంది.
ఉజ్వల్(7) ఒకటో తరగతి చదువుతున్నాడు. వారుంటున్న భవనం మొదటి అంతస్తు నుంచి 15 రోజుల క్రితం ఉజ్వల్ పడిపోయాడు. ఇంటి యజమాని గమనించి ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. కోలుకుని ఇంటికి వచ్చిన బాలుడు శనివారం సాయంత్రం విగతజీవిగా కనిపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సవతి తల్లిని అనుమానించి విచారించగా ఉజ్వల్‌ను గొంతు నులిమి హత్య చేసినట్లు చెప్పింది. భవనంపై నుంచి తోసినా బతకడంతో గొంతు నులిమానని అంగీకరించింది. ఆమెను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.