ఏసీపీ వి.వి.నాయుడు పెట్టే బాధలు భరించలేకే ఆత్మహత్యకు సిద్ధపడినట్లు ఏపీలోని విజయవాడ దిశ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ విజయ్‌కుమార్ ఆరోపించారు. ఈ మేరకు విజయవాడ కమిషనర్‌కు లేఖ రాశారు. ఏసీపీ నాయుడు అందరి ముందు తిట్టడమేకాకుండా పరువు నష్టం దావా వేయిస్తానని బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సంతోషంగా ఉద్యోగ విరమణ చేయనివ్వబోనంటున్నారని లేఖలో వివరించారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఎస్సై రాసిన లేఖ విజయవాడ పోలీసు వర్గాల్లో కలకలం రేపుతుంది. ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎస్సై విజయ్ కుమార్ రింగ్ రోడ్డులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో మాచవరం పోలీసులు అక్కడకు వెళ్లి ఆరా తీశారు.
ఓ కేసులో నిందితుడిగా ఉన్న ట్రాన్స్‌కో కానిస్టేబుల్ నవకాంత్ను తప్పించాలని తనపై ఒత్తిడి తెచ్చారన్న ఎస్సై.. అతడి ఎదుట అవమానకరంగా మాట్లాడినట్లు మాచవరం పోలీసులకు తెలిపారు. నవకాంత్ను కేసు నుంచి తొలగించినట్లు రాయించి సంతకాలు పెట్టిస్తానని భయపెట్టడంతో నిద్ర మాత్రలు మింగినట్లు విజయ్ కుమార్ తెలిపారు. వివరాలు నమోదు చేసుకున్న అధికారులు.. దిశ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం జరగడంతో కేసును గవర్నర్‌పేట పోలీసులకు బదిలీ చేశారు. ఈ అంశంపై శాఖాపరమైన విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు.. ఏడీసీపీ 1 ఎం.ఆర్. కృష్ణంరాజును దర్యాప్తు అధికారిగా నియమించారు.
ఇదీ చదవండి: ద్విచక్రవాహనాల్లో 450 కిలోల గంజాయి తరలింపు.. సీజ్ చేసిన ఆబ్కారీ అధికారులు