Mahesh Bank Hacking case: మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్ కేసులో పలువురు ఖాతాదారులను హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్కీ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న సైబర్‌క్రైం పోలీసులు... హ్యాకర్లకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. పలువురి ఖాతాలను సేకరించి నైజీరియన్లకు అందించడంలో లక్కీ.. కీలక పాత్ర పోషించినట్లు సైబర్ క్రైం పోలీసులు భావిస్తున్నారు.
షానవాజ్ ఎక్కడుంది..?
లక్కీతో పాటు అతడికి సహకరించిన పలువురు ఖాతాదారులను సైబర్‌క్రైం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మహేశ్ బ్యాంకు సర్వర్ నుంచి వినోద్, నవీన్, షానవాజ్, సంపత్ ఖాతాలకు 12.9 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ నలుగురిలో షానవాజ్ ఖాతాకే దాదాపు 7కోట్లు బదిలీ అయ్యాయి. షానవాజ్ ఇప్పటి వరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. గోల్కొండకు చెందిన ఆమె కొంతకాలంగా ముంబయిలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే నైజీరియన్లతో పరిచయం ఏర్పడి... వాళ్లకు ఖాతా సమకూర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఎవరు హ్యాక్ చేశారు..
నైజీరియన్లు ఎక్కడి నుంచి సర్వర్ ను హ్యాక్ చేశారనే విషయాన్ని గుర్తించేందుకు సైబర్ క్రైం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు పలువురు ఖాతాదారులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పటికీ... సర్వర్‌ను హ్యాక్ చేసిందెవరనే విషయాన్ని మాత్రం పోలీసులు నిర్దరించుకోలేకపోతున్నారు. దీనికోసం పోలీస్ శాఖలోని సీఐ సెల్‌తో పాటు.. ఇంటిలిజెన్స్ వర్గాల సహాయాన్ని సైబర్‌క్రైం పోలీసులు తీసుకుంటున్నారు.
ఇదీ జరిగింది..
సేవ చేయడం కోసమని విదేశాల నుంచి పలువురు డబ్బులు డిపాజిట్ చేస్తారని... వాటిలో 30 శాతం కమిషన్ తీసుకొని మిగతా డబ్బులు ఇవ్వాలని సైబర్ నేరగాళ్లు ఖాతాదారులను నమ్మించారు. హ్యాకింగ్ చేయడానికి రెండు మూడు నెలల ముందు నుంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్న హ్యాకర్లు, గత నెల 22, 23 తేదీల్లో మహేశ్ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్ చేశారు. 4 ఖాతాలకు 12.9 కోట్ల రూపాయలు బదిలీ చేశారు. 4 ఖాతాల నుంచి 128 ఖాతాలకు నగదు బదిలీ జరిగింది. ఆ తర్వాత ఒక్కో ఖాతా నుంచి నగదును విత్ డ్రా చేసుకున్నారు.