హైదరాబాద్ శివారులోని బాహ్య వలయ రహదారి(ORR-OUTER RING ROAD) సమీపంలో ఎన్సీబీ అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రక్‌లో తరలిస్తున్న 3,400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గంజాయి విలువ రూ.21 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ట్రక్‌లో గంజాయి తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన అధికారులు.. 28న రాత్రి పొద్దుపోయిన తర్వాత ట్రక్‌ను సీజ్ చేశారు. ట్రక్కులో పైన పూలమొక్కలు ఉంచి లోపల గన్ని బ్యాగుల్లో గంజాయిని దాచిపెట్టారు. పూల మొక్కలు తొలగించి చూస్తే గంజాయి సంచులు బయటపడ్డాయి.
మహారాష్ట్రకు తరలించి అక్కడి నుంచి ముంబై, పుణేకు సరఫరా చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. గంజాయి స్మగ్లింగ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ముంబైలో పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అధికారులు 25 మందిని అరెస్టు చేసి, 7,500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: Flipcart: ఫ్లిప్‌కార్ట్ పార్శిళ్లలో రాళ్లు, పెంకులు... నలుగురు అరెస్ట్