Seva Cooperative Society Theft : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సేవ మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సోసైటీలో జరిగిన భారీ చోరీని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని కో ఆపరేటివ్ సోసైటీలో అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేవలం మూడు గంటల్లోనే చోరీని ఛేదించారు.
నిందితులు షేక్ సాధిక్, మహహ్మద్ షాబాజ్ నుంచి రూ.14,03,960, 13 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ముందుగా ఫిర్యాదుదారులు రూ.34 లక్షలు చోరీకి గురైనట్లుగా చెప్పినప్పటికీ వాస్తవంగా దొంగతనానికి గురైన నగదు రూ.14లక్షలు మాత్రమే అని సీపీ సత్యనారాయణ చెప్పారు. మొదటగా ఫిర్యాదు దారులు చెప్పిన అంశంపై పూర్తిగా విచారణ జరుపుతున్నామని సీపీ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే...
కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని సేవ కోపరేటివ్ సొసైటీ బ్యాంకులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి 2గంటల సమయంలో చొరబడ్డాడు. అర్ధరాత్రి వేళ దొంగ లైటు వేసి... నగదుకు సంబంధించిన బీరువా కోసం వెతికాడు. సీసీ కెమెరాల్లో పడకుండా లైట్లు ఆర్పివేసి.. తాళం తీసే పనిలో పడ్డాడు. అయినా నిఘా నేత్రాలకు చిక్కాడు. జమాతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు సేవా కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తుంటారు. వసూలైన సొమ్ము రూ.34లక్షలు, 8తులాల బంగారం అపహరణకు గురైనట్లు నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం వసూలైన సొమ్ము ఇవాళ పంజాబ్ నేషనల్ బ్యాంకులో జమ చేయాల్సి ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... క్లూస్ టీమ్ రప్పించి దర్యాప్తు చేపట్టి కేవలం మూడు గంటల్లోనే కేసును ఛేదించారు.
'ఐదు సంవత్సరాల నుంచి చిరువ్యాపారస్తులకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. 120 రోజుల్లో కడతారు. రోజూ ఫైనాన్స్ కడతారు. దుకాణాల వద్దకు వెళ్లి కలెక్షన్లు చేస్తాం. ఐదు ఏళ్ల నుంచి ఇలాగే చేస్తున్నాం. ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. రూ.34లక్షలు, ఎనిమిది తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అందుకు సంబంధించిన ఆధారాలు సీసీ కెమెరాల్లో నమోదైంది.'
-జమాతే ఇస్లామీ హిందూ నిర్వాహకులు
ఇదీ చదవండి: 'గౌతమ్‌రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది'