జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో రెండు ఇళ్లలో దొంగలు పడ్డారు. 14 తులాల బంగారం, 40 తులాల వెండి, 15 వేల నగదును అపహరించుకుపోయారు. గ్రామానికి చెందిన కడారి సాయమ్మ కుటుంబం.. వేసవి కావడంతో ఇంటికి తాళం వేసి ఆరుబయట నిద్రిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దుండగులు.. సాయమ్మ దిండు కింద ఉన్న తాళం చెవిని తీసుకొని ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో దాచిన 9 తులాల బంగారం, 22 తులాల వెండి, 10 వేల నగదును దోచుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన రాజోలు శ్రీనివాస్ గౌడ్ ఇంట్లోకి చొరబడి 5 తులాల బంగారం, 25 తులాల వెండిని దొంగిలించారు.
సీసీలో దృశ్యాలు..
మరో రెండిళ్లలో చోరీకి పాల్పడేందుకు యత్నించగా కుటుంబ సభ్యులు నిద్రలేవడంతో దొంగలు పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలంలో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మపురి పట్టణంలో అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నిక్షిప్తమయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: బాణామతి నెపంతో దాడి... వ్యక్తి మృతి