తిరుమలకు వచ్చే భక్తుల్లో శ్రీనివాసుడి తర్వాత.. ఎక్కువమంది గోవింద రాజస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. దేశవిదేశాల నుంచి వచ్చే వారితో నిత్యం ఆలయ పరిసరాలు కిటకిటలాడుతుంటాయి. ఇక్కడ కొలువైన గోవింద రాజస్వామి తిరుమల వేంకన్నకు.. పెద్దన్నగా పూజలందుకుంటారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆలయంలో ఓ దొంగ రాత్రంతా గడపటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. శనివారం ఉదయం ఆలయం తలుపులు తెరిచిన తితిదే విజిలెన్స్ సిబ్బంది.. ధ్వజస్తంభం వద్ద ఉన్న హుండీ సీల్ కిందపడి ఉండడాన్ని గమనించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన తితిదే భద్రతా, నిఘా సిబ్బంది.. తిరుపతి అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి క్రైం పోలీసులు, తితిదే నిఘా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఓ ఆగంతకుడు ఆలయంలో ప్రవేశించినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.
సిబ్బంది కంట పడకుండా..
శుక్రవారం రాత్రి స్వామివారి ఏకాంతసేవ తర్వాత ఆలయంలోనే నక్కిన ఆగంతకుడు.. సిబ్బంది కంటపడకుండా దాక్కున్నాడు. రాత్రంతా ఆలయంలోనే ఉన్న దొంగ.. కంటికి కనిపించిన వస్తువులను కొల్లగొట్టే ప్రయత్నం చేసి విఫలమైనట్లు సీసీ టీవీ దృశ్యాల ద్వారా స్పష్టమవుతోంది. ప్రత్యేకించి ధ్వజస్తంభం పక్కనే ఉన్న హుండీని తెరిచేందుకు ఆగంతకుడు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. తన వద్దనున్న సామాగ్రితో తాళం తెరిచేందుకు ప్రయత్నించాడు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు సీసీ కెమెరాలను పగలగొట్టేందుకు యత్నించాడు. ఉదయం సుప్రభాత సేవ కోసం ఆలయంలోకి వచ్చిన భక్తులతో పాటు నిందితుడు బయటికి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఆలయంలో ఎలాంటి వస్తువులు చోరీ కాలేదని క్రైం డీఎస్పీ మురళీధర్ తెలిపారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు.
అధికారుల పనితీరుపై విమర్శలు
గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన ఈ ఘటన వెనుక తితిదే భద్రతా సిబ్బంది, విజిలెన్స్ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో ఇదే ఆలయంలో స్వర్ణకీరిటాలు చోరీకి గురయ్యాయి. అప్పటినుంచైనా అప్రమత్తంగా ఉండాల్సిన తితిదే సీసీ టీవీ కమాండ్ కంట్రోల్ కేంద్రం సిబ్బంది.. అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
'సీసీ కెమెరా దృశ్యాల్లో దొంగను గుర్తించాం. ఎలాంటి వస్తువులు చోరీ కాలేదు. రాత్రంతా వ్యక్తి లోపలే ఉన్నాడు. ధ్వజస్తంభం వద్ద చోరీకి యత్నించాడు. తాళాలు తెరిచేందుకు యత్నించినా సాధ్యపడలేదు. ఉదయం భక్తులతో కలిసి బయటకెళ్లినట్లు భావిస్తున్నాం. దొంగ వయసు 20-25 ఏళ్లు ఉంటుందని అనుకుంటున్నాం. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకుంటాం'-మురళీధర్, క్రైమ్ డీఎస్పీ
గోవిందరాజస్వామి ఆలయంలో చోరీ ఘటనపై.. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్పందించారు.
ఆలయంలో ఎటువంటి దొంగతనం జరగలేదు. నిందితుడు హుండీ తెరిచేందుకు యత్నించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకుంటాం. కేసు విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. - వెంకట అప్పలనాయుడు, తిరుపతి అర్బన్ ఎస్పీ
ఇదీ చదంవడి:యాదాద్రి ఆలయంలో 30 మందికి కరోనా పాజిటివ్