Robbery at ATM: ఏటీఎం కేంద్రాల నుంచి అక్రమంగా నగదు విత్‌డ్రా చేస్తున్న హరియాణాకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఏపీలోని అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.77,500/- నగదు, 71 ఏటీఎం కార్డులు, 2 మొబైల్ ఫోన్లు, 2.1 కేజీల గంజాయి, ఇతర సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఒకటో పట్టణ సీఐ ప్రతాపరెడ్డి తెలిపారు. కాగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు.
హరియాణా రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులతో పాటు మరో వ్యక్తి కలిసి ఇతరులకు సంబంధించిన ఏటీఎం కార్డుల ద్వారా అక్రమంగా నగదు డ్రా చేసుకోవడం పరిపాటిగా చేసుకున్నారు. ఈక్రమంలో నాలుగు రోజుల కిందట అనంతపురం సంగమేష్ నగర్‌లోని ఓ ఏటీఎంలోకి ఈ ముగ్గురు చొరబడ్డారు. వీరి వద్ద ఉన్న సాంకేతిక పరికరాల సహాయంతో ఏటీఎం మెషిన్‌ను మేనేజ్ చేసి నగదు విత్ డ్రా చేసుకున్నారు. నగదు విత్ డ్రా వివరాలు ఖాతాదారుల అకౌంట్లో నమోదు కాకుండా మోసాలకు పాల్పడ్డారు. ఏటీఎం నుంచి నగదు లోడ్ అయి బయటకు వచ్చే సమయంలో వారి వద్ద గల సాంకేతిక పరికరాలతో ఏటీఎం మెషిన్‌కు పవర్ సప్లయ్ కాకుండా చేశారు. నగదు తీసుకున్న తర్వాత పవర్ సప్లయ్ ఇచ్చారు. ఈ విధంగా సుమారు రూ. 4,05,500/- నగదు విత్ డ్రా చేసుకున్నారు.
ఇదీ చూడండి: Gold seize in shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.3.60 కోట్ల విలువైన బంగారం పట్టివేత