కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న ఆటోను వెనకనుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళను ప్రమాద స్థలం నుంచి 2 కిలోమీటర్ల వరకు లారీ లాక్కెళ్లింది. ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామనికి చెందిన 12 మంది గ్రామం నుంచి ఆటోలో నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్ పూర్ గ్రామంలో అంత్యక్రియలకు వెళ్లారు. అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఆటోలో తిరుగు ప్రయణమయ్యారు. సదాశివనగర్ మండలం పద్మాజీవాడి చౌరస్తా వరకు రాగానే వెనక నుంచి వస్తున్న లారీ ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన గడ్డం మమత తలపై నుంచి లారీ టైర్ వెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడే మృతి చెందింది. మరో మహిళ గడ్డం లక్ష్మీని చౌరస్తా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ స్కూల్ వరకు లారీ తోసుకుపోయింది.
ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు కాగా ఇద్దరికి తీవ్ర గాయలయయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: Rain: కరీంనగర్లో భారీ వర్షం.. రోడ్డుపైకి వర్షపు నీరు