వరుస హత్యలు, దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరగాడిపై రాచకొండ పోలీసులు పీడీ చట్టం నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామారికి చెందిన మైనం రాములు 2003 నుంచి మహిళలే లక్ష్యంగా హత్యలకు పాల్పడ్డాడు. ఇప్పటి వరకు 17 మంది మహిళలను దారుణంగా హత్య చేశాడు. తన భార్య మరొకరితో కలిసి వెళ్లిపోవడంతో అతను మహిళలను లక్ష్యం చేసుకొని నేరాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఒకసారి పోలీసులకు చిక్కి తప్పించుకున్నాడు.
ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనిపై మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. కూకట్‌పల్లి, నార్సింగి పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన హత్య కేసుల్లో జీవిత ఖైదు శిక్ష పడింది. మానసిక పరిస్థితి బాగలేదని జైలు సిబ్బంది అతన్ని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్పించగా అక్కడ నుంచి తప్పించుకున్నాడు. సీసీ కెమారాల ద్వారా నేరగాడిని గుర్తించిన అధికారులు అరెస్టు చేసి తిరిగి రిమాండ్‌కు తరలించారు. ఇతనిపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ పీడీ చట్టం నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.