Cheating by Movie Chances: చిత్ర పరిశ్రమలో అవకాశాలు కల్పిస్తానని అమాయకులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని విశాఖపట్నం గాజువాకకు చెందిన కాశీ సునీల్ కుమార్.. ఈజీ మనీపై దృష్టి సారించాడు. అందుకు చిత్ర పరిశ్రమను ఎంచుకుని.. ప్రణాళిక రచించాడు.
దాదాపు లక్షన్నర మోసం
సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించే వారిని టార్గెట్ చేసి.. సునీల్ వారితో పరిచయాలు పెంచుకున్నాడు. సినీఫీల్డ్‌లో అవకాశాలు కల్పిస్తానని చెప్పి.. ఇండస్ట్రీలో తనకు ఫలానా వ్యక్తులు తెలుసని వారిని నమ్మించేవాడు. అలా వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఓ వ్యక్తి వద్ద రూ. 91,420, మరో వ్యక్తి వద్ద రూ. 42,000 తీసుకున్నాడు. అవకాశం వచ్చేలా చూడమని డబ్బులిచ్చిన వాళ్లు ఎన్నిసార్లు అడిగినా.. ఇవాళ, రేపు అంటూ సాగదీశాడు. రోజులు గడుస్తున్నా.. సరైన స్పందన లేకపోయేసరికి అనుమానం వచ్చిన బాధితులు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాశీ సునీల్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఒక బ్యాంకు అకౌంట్ పాస్ బుక్, రెండు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: Mother Suicide attempt: తల్లి మనసు విరిగింది.. తనకు తాను కాల్చుకుంది