Protest with mother's dead body for land: మా భూమి మాకు దక్కే వరకు... తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేది లేదని కుమారుడు, కుమార్తె భీష్మించుకు కూర్చున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. భూత్పుర్ మండలం కప్పేట గ్రామానికి చెందిన చెన్నమ్మ (70) మృత్యువాత పడి మూడు రోజులైనా తాతల నుంచి వస్తున్న ఆస్తిని ఇచ్చే వరకు ఇంటి ముందు నుంచి శవాన్ని తీసేది లేదంటూ పట్టుబట్టారు.
తన భర్తకు దక్కవలసిన పొలం ఇవ్వాలని గత 10 ఏళ్లుగా చెన్నమ్మ గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల చుట్టూ, మండల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వచ్చింది. ధరణి పోర్టల్ తదితర కారణాలవల్ల అధికారులు సైతం ఆమెకు ఎటువంటి న్యాయం చేయలేకపోయారు. కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయింది. ఇటీవల ఇంట్లో నిప్పు అంటుకొని ప్రమాదానికి గురై శనివారం మృతిచెందింది.
తల్లిదండ్రులు ఉన్నప్పుడే మాకు దక్కవలసిన భూమి దక్కలేదని.. ఇప్పటికైనా గ్రామ పెద్దలు, అధికారులు కలగజేసుకొని న్యాయంగా తమకు రావలసిన భూమి మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారి పిల్లలు ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకూ అంత్యక్రియలు నిర్వహించేది లేదని భీష్ముంచుకొని కూర్చున్నారు.
కప్పెట గ్రామానికి చెందిన బోయ నారాయణ, బోయ రాములు అన్నదమ్ములు. వీరికి పదిహేను ఎకరాలకు పైగా పొలం ఉంది. అదంతా బోయ నారాయణ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. తరువాత కాలంలో తమ్ముడు బోయ రాములు చనిపోవడంతో.. ఆ భూమిని తనపేరున రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన భార్య చెన్నమ్మ కోరుతూ వచ్చింది. కానీ ప్రయోజనం లేకపోయింది.
ఈ క్రమంలో భూమి దక్కకపోవడంతో రాములు భార్య చెన్నమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు భూమి పంచితేనే.. అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె పిల్లలు ఆందోళన చేపట్టారు. తాతల నుంచి వచ్చిన భూమి తమకు రాసి ఇవ్వాలని తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి కొడుకు, కూతురు పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల మెట్లు ఎక్కారు.
ఇవీ చదవండి: