కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ. 30 లక్షల విలువైన గుట్కాను సంగారెడ్డి జిల్లా చిరాగ్ పల్లి పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి వద్ద ముంబయి-హైదరాబాద్ 65వ నంబరు జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన లారీని తనిఖీ చేయగా.. నిషేధిత గుట్కా బస్తాలు లభించాయి.
అక్రమ రవాణాకు పాల్పడుతున్న హైదరాబాద్‌కు చెందిన షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, షేర్అలీతో పాటు లారీ డ్రైవర్ గౌసుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీని జప్తు చేసి పట్టుబడిన గుట్కా బస్తాలను ఠాణాలో భద్రపరిచారు.