Amalapuram Riots Updates : కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఈనెల 24న చెలరేగిన హింసాత్మక ఘటనలపై.. పోలీసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. అల్లర్లకు పాల్పడిన మరో 18 మందిని అరెస్ట్ చేసినట్టు అమలాపురం ఎస్పీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 62 మంది అరెస్టయ్యారు. అనుమానితుల కోసం 6 బృందాలతో గాలింపు చేస్తున్నారు. పట్టణంలో పోలీసుల అదనపు బలగాల పహరా కొనసాగిస్తున్నారు. 144 సెక్షన్, పోలీస్ చట్టం 30 అమలులో ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరించారు.
మరోవైపు వరుసగా ఐదో రోజూ ఇంటర్నెట్ సేవలు నిలిపి వేయడంతో జనానికి అగచాట్లు తప్పడం లేదు. మొబైల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య శ్రీ సేవలు, ఉపాధి హామీ పనుల నమోదు, వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. సిగ్నల్ వచ్చే ప్రాంతాల వైపు జనం పరుగులు పెడుతున్నారు.
గోదావరి తీరం, గోదారి లంకలతోపాటు రాజమహేంద్రవరం, కాకినాడ, పాలకొల్లు, జొన్నాడ, ముక్తేశ్వరంరేవు, యానాం తదితర ప్రాంతాల వైపు వెళ్లి మొబైల్ డేటా వినియోగించుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా గోదావరి తీర ప్రాంతాల్లో నెట్ అందుబాటులోకి వచ్చే ప్రాంతాల వైపు వెళ్తున్నారు. కలెక్టరేట్లో నేడు స్పందన కార్యక్రమం ఉండటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అలాగే అంబేడ్కర్ మద్దతుదారులు నిరసనలకు పాల్పడే అవకాశం ఉందన్న వదంతులు వ్యాపించడంతో.. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.