Woman murdered for gold: విష్ణుపురి ఎక్స్‌టెన్షన్ కాలనీలో సోమవారం అదృశ్యమై హాత్యకు గురైన మహిళ కేసులో మల్కాజ్గిరి పోలీసులు పురోగతి సాధించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆలయ పూజారినే ఆభరణాలపై ఆశతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుసుకున్నారు. ప్రధాన నిందితుడు అనుముల మురళీ కృష్ణ అలియాస్ కిట్టూ(40), నగల వ్యాపారి జోషి నందకిషోర్(45)ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. విష్ణుపురి ఎక్స్‌టెన్షన్ కాలనీకి చెందిన జి.ఉమాదేవి(57) సోమవారం సాయంత్రం బయటకు వెళ్లి అదృశ్యమయ్యారు. ఆమె భర్త జీవీఎన్ మూర్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె కోసం గాలిస్తున్న పోలీసులకు గురువారం ఉదయం కాలనీ సమీపంలోని దేవాలయం వెనుక మృతదేహం కనిపించింది. ఒంటిపై నగలు లేకపోవడంతో ఆభరణాల కోసమే హత్య చేసినట్టుగా పోలీసులు భావించి ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
అక్షింతలు వేస్తానంటూ: విష్ణుపురి ఎక్స్‌టెన్షన్ కాలనీలోని స్వయం భూ సిద్ది వినాయకస్వామి దేవాలయం అర్చకుడు మురళీకృష్ణది ప్రకాశం జిల్లా పామూరు పట్టణం స్వస్థలం. బతుకు దెరువు కోసం మల్కాజిగిరి వచ్చి ఆలయంలో నాలుగేళ్లుగా అర్చకుడిగా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా అదే ప్రాంతంలో ఉండే ఉమాదేవి రోజూ సాయంత్రం ఒకే సమయానికి దేవాలయానికి రావటం గమనించాడు. విలాసాలకు అప్పులు చేసిన మురళీకృష్ణకు ఆర్థిక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. బయటపడేందుకు ఉమాదేవిని హతమార్చి నగలు కాజేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆలయ పరిసరాల్లోని 8 సీసీ టీవీ కెమెరాలు పనిచేయకపోవటాన్ని అవకాశంగా చేసుకున్నాడు. రోజు మాదిరిగానే ఆమె సోమవారం సాయంత్రం 6.30కు ఆలయానికి వచ్చి పూజలు చేశారు. వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అక్షింతలు వేస్తాను ఆగమన్నాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న ఇనుపరాడ్‌తో ఆమె తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఒంటిపై నగలన్నీ తీసుకున్నాడు. మృతదేహాన్ని విగ్రహం పక్కనే ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి మూతపెట్టాడు. రక్తపు మరకలు కనబడకుండా నీటితో కడిగాడు. అదేరోజు రాత్రి బంగారు దుకాణంలో నగలు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు.
ఎమ్మెల్యే పరామర్శ: సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలోని శ్మశానవాటిలో శుక్రవారం ఉమాదేవి అంత్యక్రియలు నిర్వహించారు. మల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు ఉమాదేవి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు.
రెండ్రోజులు డ్రమ్ములోనే మృతదేహం: మృతదేహం నుంచి దుర్వాసన రావటంతో నిందితుడు అప్రమత్తమయ్యాడు. బుధవారం రాత్రి ఆలయ వెనుక భాగంలో చెట్ల మధ్య మృతదేహాన్ని పడేశాడు. ఆ తర్వాత డ్రమ్ము, ఆలయాన్ని మరోసారి శుభ్రం చేసి దూపం వేశాడు. మల్కాజిగిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏసీపీ శ్యాంప్రసాద్, ఇన్‌స్పెక్టర్లు జగదీశ్వర్‌రావు, ఎ.సుధాకర్ బృందం చుట్టు పక్కల సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఉమాదేవి ఆలయానికి వచ్చి వెనక్కి వెళ్లలేదని, ఆమె పాదరక్షలు ఆలయంలోనే వదలి వెళ్లినట్టు గుర్తించారు. అర్చకుడి కదలికలపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య కేసు ఛేదించటంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్, ఇన్‌స్పెక్టర్లు జగదీశ్వర్‌రావు, సుధాకర్‌లను రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించారు.