తిరుపతిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ భువనేశ్వరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త శ్రీకాంతే ఆమెను హత్య చేశారని.. అదనపు ఎస్పీ సుప్రజ వెల్లడించారు. భువనేశ్వరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. దిండుతో ఊపిరి ఆడకుండా చేసి శ్రీకాంత్ రెడ్డి చంపేశాడని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని సూట్ కేసులో తీసుకెళ్లి రుయా ఆస్పత్రి వెనుక ప్రాంతంలో కాల్చేసినట్లు వివరించారు. నిందితుడు శ్రీకాంత్‌పై గతంలోనే కడపలో చీటింగ్ కేసు ఉన్నట్లు తెలిపారు. శ్రీకాంత్ రెడ్డి, భువనేశ్వరి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని అదనపు ఎస్పీ సుప్రజ వెల్లడించారు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య ఆర్థిక వ్యవహారాలపై తరచుగా గొడవలు జరిగినట్లు సమాచారం ఉందన్నారు.
'ఏపీలోని కడప జిల్లా బద్వేలుకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన భువనేశ్వరి(27)ని మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అవినీతి నిర్మూలన పేరిట శ్రీకాంత్‌రెడ్డి ఓ సంస్థను స్థాపించాడు. రూ.90 వేలు జీతం తీసుకునే భార్యను వేధించేవాడు. ఆమె జీతం విలాసాలకు ఖర్చు చేసేవాడు. కట్నం కోసం ఆమెను అవస్థలకు గురిచేసేవాడు. గత నెల 21న కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 22వ తేదీ తెల్లవారుజామున భువనేశ్వరి నిద్రిస్తుండగా.. ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆ రోజు రాత్రంతా మృతదేహాన్ని అపార్ట్‌మెంట్ బెడ్రూమ్లోనే ఉంచాడు. మరుసటి రోజు ఉదయం పెద్ద సూట్‌కేస్ కొనుగోలు చేసి అందులో భువనేశ్వరి మృతదేహాన్ని ప్యాక్ చేశాడు. మధ్యాహ్నం క్యాబ్ బుక్ చేసుకొని రుయా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. క్యాబ్ డ్రైవర్‌కు అనుమానం రాకుండా సూట్‌కేస్‌లో వెంటిలేటర్ ఉందని చెప్పాడు. రుయా ఆసుపత్రి ప్రాంగణంలోని డ్రగ్స్ స్టోర్ వద్దకు చేరుకుని మృతదేహం ఆనవాళ్లు లేకుండా పెట్రోల్ పోసి కాల్చేశాడు. అనంతరం కరోనా డెల్టా ప్లస్ వైరస్‌తో భువనేశ్వరి చనిపోయిందని చెప్పి బంధువులకు సమాచారమందించాడు. మరుసటి రోజు కాలిన మనిషి అవశేషాలు వెలుగులోకి రావడంతో కూతురిని రామసముద్రంలోని అమ్మమ్మకు అప్పగించి పరారయ్యాడు. చివరకు మృతురాలి అక్క కుమార్తె అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భువనేశ్వరి హత్య తర్వాత ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా శ్రీకాంత్ తీసుకెళ్లాడు. అవన్నీ స్వాధీనం చేసుకున్నాం.
- సుప్రజ, అదనపు ఎస్పీ.
ఇదీచూడండి: Viral video: భార్యను చంపి సూట్‌కేసులో ప్యాకింగ్.. సీసీటీవీ వీడియో