యాదాద్రి భువనగిరి జిల్లాలో అదృశ్యమైన స్థిరాస్తి వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ గౌడ్ హత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. రామకృష్ణగౌడ్‌ది పరువు హత్యగా పోలీసులు తేల్చారు. గౌడ కులానికి చెందిన రామకృష్ణను ముదిరాజ్ కులానికి చెందిన భార్గవి గతేడాది కులాంతర వివాహం చేసుకోగా.. తన కుమార్తెను పెళ్లి చేసుకున్న రామకృష్ణపై ఆమె తండ్రి కక్ష పెంచుకున్నాడు. రామకృష్ణకు స్నేహితుడైన లతీఫ్ అనే వ్యక్తితోనే భార్గవి తండ్రి వెంకటేశ్వర్లు హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసు వివరాలను భువనగిరి ఏసీపీ వెంకట్ రెడ్డి వెల్లడించారు.
రామకృష్ణ కనిపించట్లేదని ఆయన భార్య భార్గవి శనివారం ఫిర్యాదు చేశారని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సిద్దిపేట జిల్లాలో అతడి మృతదేహం లభ్యమైందని ఏసీపీ తెలిపారు. మృతుడి భార్య లతీఫ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేయగా.. ఆ దిశగా కేసు విచారణను ప్రారంభించామన్నారు. మోత్కూరుకు చెందిన లతీఫ్‌ను పట్టుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని చెప్పారు. లతీఫ్ తన భార్య, మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు తేలిందని భువనగిరి ఏసీపీ తెలిపారు. రామకృష్ణ మృతదేహాన్ని కుకునూరుపల్లి వద్ద కాలువలో పడేశామని లతీఫ్ చెప్పాడని ఆయన వెల్లడించారు. మహిళ, మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్న ఏసీపీ.. ఈ హత్యలో మొత్తం 11 మందికి భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: