హైదరాబాద్ శివారు పటాన్చెరు, జేపీ కాలనీకి చెందిన ఉప్పరి రాజు ప్రసాద్ అలియాస్ రాజు ఆటో డ్రైవరుగా పనిచేస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో దొంగ నోట్ల చెలామణి మొదలుపెట్టాడు. ఈ వ్యవహారంలో పలు మార్లు పట్టుబడ్డాడు. పటాన్చెరు, మండవల్లి, ఏలూరు, బాచుపల్లి, సంగారెడ్డి పోలీసులకు చిక్కి కస్టడీకి వెళ్లొచ్చాడు.
అయినా బుద్ధి మార్చుకోని రాజు.. దొంగనోట్ల చెలామణి కొనసాగించాడు. యూట్యూబ్‌లో నోట్లను ఎలా ముద్రించాలో తెలుసుకున్న రాజు.. కలర్ ప్రింటర్ కొని దానితో నోట్లను ముద్రించడం మొదలుపెట్టాడు. ఆ నకిలీ నోట్లను బయట వారికి అంటగట్టేవాడు. అలా ఇస్నాపూర్‌లోని ఓ చెప్పుల దుకాణంలో దొంగ నోటును మార్చాడు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హోటల్లో నకిలీ నోట్లను మారుస్తుండగా చిక్కాడు. రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 14 నకిలీ రూ.2 వేల నోట్లను, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి: రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా