నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అలియాస్ శివ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ దూరపు బంధువైన సూర్యాపేట జిల్లా నడిగూడెంకు చెందిన పరిషపాక మంగమ్మతో కలిసి కొన్నేళ్లుగా దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. శ్రీకాంత్ ఆటోడ్రైవర్‌గా, మంగమ్మ ప్రయాణికురాలిగా నటిస్తూ వృద్ధ మహిళలను ఆటోలో ఎక్కించుకొని దోపిడీ చేస్తున్నారు.
నల్గొండ జిల్లా మర్రిగూడేనికి చెందిన కక్కునూరి గోపమ్మ అనే వృద్ధురాలిని ఈ నెల 19న యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఆటోలో ఎక్కించుకొని ఆమె సొంతూరికి తీసుకెళ్తామని నమ్మబలికారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వృద్ధురాలి వద్ద ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలను లాక్కొని నిందితులిద్దరూ ఆటోలో పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంస్థాన్ నారాయణపురంలో అనుమానాస్పదంగా ఆటోలో వెళ్తున్న నిందితులను శనివారం ఉదయం ఎస్సై సుధాకర్‌రావు అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తులో నిందితులు వారు చేసిన దొంగతనాలను బయటపెట్టారని డీసీపీ తెలిపారు. వీరిపై ఖమ్మం జిల్లాలో ఒక కేసు, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోనూ కేసులు నమోదైనట్లు వివరించారు. నిందితుల నుంచి రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు ఆటోలు, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దోపిడీకి పాల్పడిన సొత్తు రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌కు చెందిన వడిత్యా జైపాల్‌కు, ఎల్బీనగర్‌కు చెందిన త్రిలోకం చౌదరికి విక్రయిస్తున్నట్లు దర్యాప్తు తేలిందని, వారిపై కేసు నమోదు చేశామని డీసీపీ నారాయణ రెడ్డి వివరించారు. సమావేశంలో సీఐ వెంకటయ్య, ఎస్సై సుధాకర్ పాల్గొన్నారు.
ఇదీచూడండి: కరోనా శవాల కోసం... ముందస్తు చితి పేర్చి...