ఆన్లైన్ రుణ యాప్ సంస్థల వేధింపుల వల్ల రాష్ట్రంలో ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారని సీసీఎస్ పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబయిలో సులభంగా రుణాలిచ్చి అధిక వడ్డీ వసూలు చేసిననట్లు కోర్టుకు సమర్పించిన అభియోగపత్రంలో పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 28 మందిని అరెస్ట్ చేశామని... వీరిలో ప్రధాన నిందితుడు ల్యాంబో తోపాటు ముగ్గురు చైనీయులున్నారని సీసీఎస్ పోలీసులు చెప్పారు.
మరో చైనా దేశస్థురాలు జెన్నీఫర్ పరారీలో ఉందని ఆమె కోసం గాలిస్తున్నట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. జెన్నీఫర్, జియాంగ్ కలిసి 2019 నవంబరులో దిల్లీ వచ్చి.. దిల్లీ, హైదరాబాద్, బెంగళూర్లో కాల్ సెంటర్లను ప్రారంభించి వాటి ద్వారా లాక్డౌన్ సమయంలో 30వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపారు. లాభంగా వచ్చిన 11వేల కోట్ల రూపాయలను వర్జిన్ ఐల్యాండ్స్లోని బ్యాంకుల్లో బినామీ ఖాతాలకు బదిలీ చేసి అక్కడి నుంచి షాంఘైకి మళ్లించారని చెప్పారు.
సులభంగా డబ్బులు ఇస్తుండటంతో నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారని.. ఒక్కో రోజు రూ.250 కోట్ల వరకు అప్పులిచ్చినట్లు దర్యాప్తులో తేలింది. లాక్ డౌన్ ప్రారంభంలో నాలుగు నెలల్లోనే 16వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు సీసీఎస్ పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు.