ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లు లింక్‌యున్, డోకీపేల ద్వారా రూ.కోట్లు కొల్లగొట్టిన చైనా కంపెనీల వ్యవహారంపై హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేస్తున్న దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ యాప్‌ల ద్వారా రూ.1100 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలంగాణ పోలీసుల దర్యాప్తులో బహిర్గతమైన నేపథ్యంలో విదేశాలకు నిధుల మళ్లింపుపై ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది.
రూ.4.5 కోట్లను క్రిప్టోకరెన్సీగా...
గుజరాత్ భావ్‌నగర్‌లోని క్రిప్టో కరెన్సీ ఏజెంట్ నైసర్ శైలేష్ కొఠారి(26) భారత కరెన్సీని యూఎస్‌డీటీ(టెథర్ కంపెనీ జారీ చేసిన అమెరికా డాలర్) క్రిప్టో కరెన్సీగా మార్చినట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకోవడంతో కీలక విషయాలు వెల్లడయ్యాయి. గుజరాత్‌కే చెందిన కమలేశ్ త్రివేది చైనా కంపెనీలకు మధ్యవర్తిగా వ్యవహరించి కొఠారి ఏజెన్సీ ద్వారా క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయించినట్లు తేలడంతో అతని కోసం ఈడీ గాలింపు చేపట్టింది. రూ.4.5 కోట్లను క్రిప్టోకరెన్సీగా మార్చినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. మరిన్ని ఏజెన్సీల నుంచి రూ.14.18 కోట్ల హవాలా లావాదేవీలను గుర్తించడం జరిగింది. మొత్తంగా రూ.104 కోట్లను విదేశాలకు తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది.
బీజింగ్ టుమారో పవర్ కంపెనీకి బదిలీ!
భారత్ నుంచి క్రిప్టో కరెన్సీ ద్వారా తరలిన నిధులు చైనాలోని ‘2018లో ఏర్పాటైన బీజింగ్ టుమారో పవర్’ కంపెనీకి బదిలీ అయినట్లు ఈడీ భావిస్తోంది. భారత్‌లో కుమార్ పత్ని అండ్ అసోసియేట్స్ కన్సల్టెంట్స్ ద్వారా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆధారాలు రాబట్టింది. మరోవైపు లింక్‌యున్, డోకీపే యాప్‌ల సంస్థలకు భారత్‌లో.. చైనాకు చెందిన యాన్‌హూ హెడ్ కాగా.. ధీరజ్ సర్కార్, అంకిత్‌కపూర్‌లు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. ఆయా సంస్థల్లోని ఉద్యోగులు భువనేశ్ మిశ్రా, ప్రేమాంశు ఆస్థానా, గరిమషైనీల నుంచి వాంగ్మూలాలను ఈడీ సేకరించింది. కొఠారి ఏజెన్సీలో మెట్ట బుచ్చయ్య, కృష్ణమూర్తి అనే వ్యక్తుల పేరిట ఉన్న రెండు నకిలీ పేటీఎం ఖాతాల ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది.
టెలిగ్రామ్ క్లోజ్డ్ గ్రూపుల్లో రెఫరల్ కోడ్‌లు
ఆన్‌లైన్ గేమింగ్ నిర్వాహకులు చట్టానికి దొరక్కుండా ఉండేందుకు కుట్ర పన్నినట్లు ఈడీ గుర్తించింది. వెబ్సైట్లలో కేవలం గేమ్‌లకు సంబంధించిన అంశాలనే కనిపించేలా చేయడంతో పాటు కొత్త వినియోగదారుల్ని ఆకర్షించేందుకు టెలిగ్రామ్ యాప్‌లో క్లోజ్డ్ గ్రూపులను ఏర్పాటు చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. వాటిల్లోనే రెఫరల్ కోడ్‌ల ద్వారా ఏజెంట్లకు సంబంధించిన కమీషన్ల లావాదేవీలు నిర్వహించినట్లు తేలింది.
ఇదీ చదవండి: చైనాలో రుణాల యాప్‌ల రూపకల్పన.. గుర్తించిన పోలీసులు