నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం దాస్నగర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీలోని విశాఖపట్నం గాజువాక శ్రీ నగర్ కాలనీకి చెందిన మాల్యాద్రి... బాసరలో తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయించడానికి రెండు రోజుల కిందట మాక్లూర్లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. బుధవారం రోజున బాసర వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
అవసరమైన వస్తువులను కొనడానికి తన భార్యా, మరో బంధువుతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ వారి వాహనాన్ని ఢీ కొట్టడంతో మాల్యాద్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కళ్ల ముందే తన భర్త విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి మాధవి రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది.
ఇదీ చదవండి: మహారాష్ట్రలో ఈ నెల14 నుంచి 144 సెక్షన్