One Accused Escape: హైదరాబాద్లో పోలీసుల అదుపులో ఉన్న ఓ నిందితుడు.. పోలీసుల కళ్లుగప్పి పారిపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ నిందితుడు తప్పించుకున్న విషయం కూడా పోలీసులకు కాసేపటి తర్వాత గానీ తెలియలేదు. నిందితుడు తప్పించుకున్నట్టు గుర్తించగానే.. చుట్టుపక్కన ఉన్న పరిసరాల్లో వెతికినా లాభం లేకపోకపోయింది. చేసేదేమీ లేక ఈ విషయాన్ని సిబ్బంది.. ఉన్నతాధికారులకు తెలియజేశారు. అజాగ్రత్తగా వ్యవహరించినందుకు ఆ పోలీసులపై ఉన్నతాధికారులు అక్షింతలు వేశారు.
గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు నిన్న(శుక్రవారం) ఉప్పల్లోని చిలుకానగర్లో ఓ ఇంటిపై దాడి చేసి ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను శనివారం కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నిందితులకు ఆరోగ్యపరీక్షలు చేసేందుకు పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. నిందితుల చేతులకు బేడీలు వేసి.. మరీ తీసుకెళ్లారు.
ఆస్పత్రి ప్రాంగణంలోకి వెళ్లాక.. కాసేపటి తర్వాత వైద్యుని దగ్గరికి తీసుకెళ్దామని చూస్తే.. ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఆరుగురిలో.. ప్రశాంత్ అనే నిందితుడు కనిపించలేదు. ఎటువెళ్లాడని ప్రాంగణమంతా వెతికారు. చివరికి పారిపోయాడని పోలీసులు గ్రహించారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనూ వెతికారు. కానీ.. లాభం లేదు. ఇక చేసేదేమీ లేక నిందితుడు తప్పించుకున్న సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించి.. ఎస్సైలు, సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు పారిపోయిన నిందితుడు ఆచూకీ తెలియకపోవడంతో ఎస్కార్ట్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంపై పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇవీ చూడండి: