ఫేస్‌బుక్ ఖాతాకు అమ్మాయి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. అంగీకరించిన మరుక్షణం నుంచే సరదా సంభాషణలతో చాటింగ్ చేస్తారు. చనువు పెరిగిన తర్వాత వాట్సప్ నంబర్ అడుగుతారు.
ఆటలో ఇది మొదటి అంకం
కొన్ని రోజుల తర్వాత ‘నన్ను నగ్నంగా చూడాలనుకుంటున్నావా?’ అంటూ ఆఫర్ ఇస్తారు. దీంతో బాధితులు ఎగిరి గంతేసినంత పనిచేస్తారు. వెంటనే అవతలివైపు నుంచి అమ్మాయి తెరపై కనిపిస్తుంది. ఒంటిపై ఉన్న దుస్తుల్ని క్రమంగా విప్పేస్తుంది.
ఇది రెండో అంకం
ఇక్కడే అసలు ఆట ఆరంభమవుతుంది. మీరు కూడా నగ్నంగా మారితే చూడాలని ఉందంటూ వలపు వల విసురుతుంది. అమ్మాయే నగ్నంగా తయారైంది కదా! మనకేం! అనే ధీమాతో బాధితులు రెచ్చిపోతారు. ఒళ్లూపై తెలియకుండా ప్రవర్తిస్తారు. ఇక్కడే ఆట మలుపు తిరుగుతుంది. బలిపశువులుగా మారుస్తుంది.
తెలంగాణలో కొంతకాలంగా బెంబేలెత్తిస్తున్న ‘వాట్సప్ వలపు వల’ కథలివి. అసలు అమ్మాయే కథలో లేకుండా అమ్మాయిల పేరుతో చాటింగ్ చేస్తూ వలేస్తున్న ముఠాల లీలలు అవి. ఏమరపాటు సమయంలో తమ వలకు చిక్కిన బాధితుల్ని పరువు తీస్తామంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్న ఈ ముఠాల దారుణానికి రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు(22) ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గత వారం తార్నాకకు చెందిన ఓ ఈవెంట్ మేనేజర్ ఈ ముఠా బారినపడి ఏకంగా రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు. వీరే కాదు ఇప్పటివరకు రాజధానిలో పలువురు బాధితులు ఈ ముఠాల బారిన పడి సైబర్‌క్రైమ్ ఠాణాలను ఆశ్రయించిన ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు ఇది హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లకు చెందిన ఉత్తరాది ముఠాల కొత్త పన్నాగంగా తేల్చారు. రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్ జిల్లాలోని ముఠాలు ఎక్కువగా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
ఫేస్‌బుక్ ఖాతాదారులే లక్ష్యం.. అమ్మాయి లేకుండానే వ్యవహారం
ఫేస్‌బుక్ ఖాతాదారులనేే ఈ ముఠా సభ్యులు ఎంచుకుంటున్నారు. ప్రొఫైల్స్‌ను పరిశీలించి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవారిని, ఎక్కువగా చాటింగ్ చేసే వారిని లక్ష్యంగా చేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. రిక్వెస్ట్‌లు పంపే ఖాతాలకు అందమైన అమ్మాయిల ప్రొఫైల్ చిత్రాలను జత చేస్తున్నారు. వాటిని యాక్సెప్ట్ చేసిన వారిపై వల విసురుతూ రంగంలోకి దిగిపోతున్నారు. అమ్మాయిల నగ్న దృశ్యాలను పంపేటప్పుడు మాత్రం అంతర్జాలం నుంచి సేకరించిన వీడియోలను చూపిస్తున్నారు. దీంతో అప్పటివరకు వాట్సప్‌లో చాట్ చేసిన అమ్మాయే నగ్నంగా తయారవుతోందనే భ్రమలోనే బాధితులు ఉండిపోతున్నారు. అదే ధీమాతో నగ్నంగా మారి ముఠాల చేతిలో చిక్కుతున్నారు. చిత్రమేమిటంటే ఇక్కడ అసలు అమ్మాయే ఉండదు. ముఠా సభ్యులే అమ్మాయి పేరుతో చాటింగ్ చేస్తారు.
మన భయమే.. వారికి వరం
‘మా బంధువుల అమ్మాయిని మోసగించి నగ్నవీడియోలు పంపించమని అడిగావంటూ’ ముఠా సభ్యులు తొలుత బాధితులను బెదిరిస్తారు. భయపడే వారితో బేరసారాలకు దిగుతారు. గూగుల్‌పే లాంటి ఖాతాల ద్వారా డబ్బు గుంజుతారు. అప్పటికీ లొంగకపోతే బాధితులు నగ్నంగా మారినప్పుడు తీసిన వీడియోలను బయటకు తీస్తారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామని, కుటుంబ సభ్యులకు, సన్నిహితుల వాట్సప్‌లకు పంపుతామని బెదిరిస్తారు. పరువుపోతుందనే భయంతో బాధితులు ఎంతోకొంత ఇచ్చి వదిలించుకుందామనే నిర్ణయానికి వస్తారు. అయినా ముఠాల వేధింపులు ఆగకపోవడంతో చివరకు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు హైదరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణాలో కొద్దిరోజుల్లోనే 15-16 నమోదయ్యాయి.
భయపడితేనే మోసం
'భరత్‌పూర్ ముఠాలు బాధితుల భయాన్నే సొమ్ము చేసుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో బాధితుల నగ్న వీడియోల్ని అప్‌లోడ్ చేస్తామని భయపెడుతున్నాయి. అలాంటప్పుడు ఫిర్యాదు చేయాలి తప్ప మానసికంగా కుంగిపోకూడదు. అపరిచిత అమ్మాయిల పేరిట వచ్చే ఫ్రెండ్‌రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకపోవడమే ఉత్తమం. వాట్సప్ నంబరును అసలే ఇవ్వొద్దు.'
- కేవీఎం ప్రసాద్, సైబర్‌క్రైమ్ ఏసీపీ, హైదరాబాద్
- ఇదీ చూడండి : త్వరలో సర్కారు బడులకు సరికొత్త హంగులు!